దసరా వచ్చిందంటే చాలు.. ఆయుధాలను శుభ్రం చేస్తారు. వాటికి పసుపు..కుంకుమ పెట్టి పూలతో అలంకరిస్తారు. టూ వీలర్..త్రీ వీలర్..ఫోర్ వీలర్ వెహికల్స్ను అందంగా అలంకరించి .. పూజ చేసి నిమ్మకాయలను కట్టి.. తొక్కించే ఆచారం ఉంది. ఇది పల్లెల్లోనే కాదు..పట్టణాల్లో కూడా పాటిస్తారు. దసరా పండుగ .. ఆయుధ పూజ.. వాహన పూజ వెనుక ఉన్న సంప్రదాయం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
దసరా పండుగకు ముందు రోజు వచ్చే ఆశ్వయుజ శుద్ధ నవమిని మహార్నవమి అంటారు. ఈ రోజున ఆయుధ పూజ నిర్వహిస్తారు. రైతులు తమ నాగలి, కొడవలి వంటి వ్యవసాయ పరికరాలు, కార్మికులు తమ పనిముట్లు, వ్యాపారులు తమ యంత్రాలు, కళాకారులు తమ వాయిద్యాలను పూజిస్తారు. మనం నిత్యం ఉపాధి కోసం ఉపయోగించే వస్తువులే మనకు ఆయుధాలు లాంటివి. వాటికి కృతజ్ఞతగా పూజ చేయడం ఆనవాయితీ.
వాహనాలకు పూజలు
విజయదశమి రోజున కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికే ఉన్న కార్లు, బైకులు, ఆటోలను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజలు చేస్తారు. వాహన పూజ పూర్తయిన తర్వాత దిష్టి పోవడానికి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రంగా ఉండాలని కోరుకుంటూ వాహనాలకు దిష్టి తీసి గుమ్మడికాయ, కొబ్బరికాయ కొడతారు.
ఆయుధ పూజా విధానం
వాహనాలు, వృత్తికి సంబంధించిన పనిముట్లు, పుస్తకాలు లేదా ఆయుధాలను శుభ్రం చేయాలి. గంధం, కుంకుమ, పసుపు, పూలతో వాటిని అలంకరించాలి. ధూపం, దీపం వెలిగించి అక్షతలు, పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. ఒక పీఠంపై లేదా వాహనాల ముందర ఒక చిన్న ముగ్గు వేసి, అక్కడ దీపారాధన చేస్తారు. బెల్లం పరమాన్నం, వడపప్పు, పానకం, లేదా కదంబంతో చేసిన అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. వ్యాపార సంస్థల్లో పేలాలు, బెల్లం, అరటిపండ్లు నివేదిస్తారు. చివరగా వాహనాలకు, వ్యాపార సంస్థల ముందర గుమ్మడికాయ లేదా నిమ్మకాయలతో దిష్టి తీసి, వాహనాల చక్రాల కింద నిమ్మకాయలను నలగగొట్టడం శుభసూచకంగా భావిస్తారు.
