మోడల్, కవయిత్రి, థెరపిస్ట్.. మల్టీ టాలెంట్‌తో ప్రశంసలు అందుకుంటున్న నటి.. ‘బాలన్’ ఫేమ్ ఫర్జానా సక్సెస్ స్టోరీ

మోడల్, కవయిత్రి, థెరపిస్ట్.. మల్టీ టాలెంట్‌తో ప్రశంసలు అందుకుంటున్న నటి.. ‘బాలన్’ ఫేమ్ ఫర్జానా సక్సెస్ స్టోరీ

మలయాళ సినిమా ‘బాలన్’ చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువగా వినిపించిన ప్రశ్న.. ‘‘అమ్మ పాత్రలో నటించింది ఎవరు?’’ ఎందుకంటే ఆమె ఆ పాత్రలో నటించలేదు.. జీవించింది! అనేది వాళ్ల అభిప్రాయం. ఆమె సినిమాలకు కొత్త, కానీ, నటన కాదు అని మొదటి సినిమాతోనే నిరూపించింది. ఆమె పేరు ఫర్జానా పాలతింగల్ (Farzana Palathinga).

థియేటర్, మోడలింగ్, కవిత్వం, అడ్వర్టైజింగ్​ రంగాల్లో తనకంటూ ఓ జర్నీ ఉంది. కానీ సిల్వర్​ స్క్రీన్​ మీద మెరవడం ఇదే తొలిసారి. దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన బాలన్​తో ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్‌‌లో నటించింది. సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫర్జానా, విడుదల తర్వాత తన సహజమైన నటనతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. 

కేరళలో పుట్టిన ఫర్జానా దుబాయ్‌లో పెరిగింది. అక్కడే స్కూల్ ఎడ్యుకేషన్​ పూర్తిచేసి, మణిపాల్ యూనివర్సిటీలో ఆక్యుపేషనల్ థెరపీ చదివింది. ఆ తర్వాత పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్​గా ఉద్యోగంలో చేరింది. మరోవైపు ఆమెకు ఎంతో ఇష్టమైన కళలను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. ఉద్యోగంతోపాటు థియేటర్‌లో నటించడం, కవిత్వం రాయడం, వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం కంటిన్యూ చేసింది. మణిపాల్‌లో చదువుతున్న రోజులే ఆమె నటనకు పునాది వేశాయి. అక్కడి ‘డ్రామనన్​ మణిపాల్​ థియేటర్ గ్రూప్​’లో చేరి కొన్ని ఇంగ్లిష్​ నాటకాలలో నటించింది. 

ఎ మిడ్ ​సమ్మర్​  నైట్స్​ తారా, డ్రీమ్​​, వీనస్ ఇన్​ ఫర్,12 యాంగ్రీ జురోర్స్, ఎ మగ్గీ నైట్​ ఇన్​ ముంబై వంటి నాటకాలలో ఆమె పోషించిన పాత్రలు రంగస్థలంపై మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ అనుభవమే తర్వాత కెమెరా ముందు కూడా ధైర్యంగా నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 

మరో రెండు ప్రపంచాలు

ఫర్జానా ప్రయాణం నటనతో మాత్రమే పరిమితం కాలేదు. నివియా, మెక్ డొనాల్డ్స్, హోమ్ సెంటర్ వంటి ప్రముఖ బ్రాండ్​ల ప్రకటనల్లో మోడల్‌గా కనిపించింది. 2019లో వనిత నిర్వహించిన గ్లామ్ క్వీన్ పోటీలో విజేతగా నిలిచి, అదే ఏడాది డిసెంబర్ మ్యాగజైన్​ కవర్​ పేజీపై చోటు సంపాదించింది. ఆమెకు కవిత్వం కూడా మరో ఇంట్రెస్ట్​. స్పోకెన్-వర్డ్ పొయెట్రీలో చురుకుగా పాల్గొన్న ఫర్జానా, ఐఐటీ బాంబే నిర్వహించిన కవితల పోటీలో బహుమతి గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన షార్ట్​ అండ్ స్వీట్​ థియేటర్ ఫెస్టివల్​లో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. రంగస్థలం, కవిత్వం, మోడలింగ్.. మూడు రంగాల్లో వచ్చిన అనుభవం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరడంలో హెల్ప్ అయింది. 

మొదటి సినిమానే ఎమోషనల్​ రోల్​

బాలన్ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. తల్లీకొడుకుల బంధం, గుర్తింపు, మనుగడ వంటి భావోద్వేగ అంశాల చుట్టూ తిరిగే కథ. ఇందులో ఫర్జానా పోషించిన తల్లి పాత్ర కథకు ప్రధాన ఆధారం. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో ఫర్జానా నటన కూడా ఒకటి. ‘ఈ కొత్త నటి ఎవరు?’ అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రివ్యూల్లో ఫర్జానా నటనకు ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. పాత్రలో ఆమె చూపించిన సహజత్వం, తల్లి పాత్రలో కనిపించిన భావోద్వేగ తీవ్రత సినిమాకు బలంగా నిలిచాయని విమర్శకులు పేర్కొన్నారు. కథ మొత్తం భావోద్వేగాన్ని మోసే పాత్రలో కొత్త నటి అయినప్పటికీ, ఎక్కడా కొత్తదనపు బెరుకు కనిపించలేదనే టాక్​ వచ్చింది.

‘బాలన్’ అవకాశం ఎలా వచ్చింది?

ఫర్జానా సినీ ప్రయాణంలో కీలక మలుపు ‘బాలన్’. ఈ సినిమా కోసం దర్శకుడు చిదంబరం ముందుగానే ఒక నిర్ణయం తీసుకున్నారు. కథలోని తల్లి పాత్రకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కొత్త ముఖమే కావాలని భావించారు. అందుకే ఆడిషన్లు నిర్వహించారు. ఒక ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ, ‘‘ఈ పాత్ర కోసం చాలామందిని పరిశీలించామని, చివరకు ఫర్జానానే పాత్రకు పూర్తిగా సరిపోయింద’’ని చెప్పారు.

తాను కోరుకున్న సహజత్వం, పాత్రలో కనిపించాల్సిన అమాయకత్వం, అంతర్గత బలం.. ఈ మూడు లక్షణాలు ఫర్జానాలో కనిపించాయని ఆయన వివరించారు. ఈ సినిమా కంటే ముందు ఆమె యాడ్స్​, షార్ట్ ఫిల్మ్‌లు చేసినా ఫీచర్ ఫిల్మ్‌లో ఇది తొలి అవకాశం అని చెప్పారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Radio Mango (@radiomango)