రక్షణ శాఖకు రక్షణ శాఖకు ..గతం బడ్జెట్ తో పోలిస్తే 15 శాతం ఎక్కువ కేటాయింపులు

రక్షణ శాఖకు  రక్షణ శాఖకు ..గతం బడ్జెట్ తో పోలిస్తే 15 శాతం ఎక్కువ కేటాయింపులు
  • మొత్తం అలకేషన్లలో మూలధన వ్యయం రూ.2.19 లక్షల కోట్లు 
  • ఎయిర్ క్రాఫ్ట్ లు, ఎయిరో ఇంజిన్లు, ఇతర హార్డ్ వేర్  సామగ్రికి రూ.63,733 కోట్లు
  • పెన్షన్ల కేటాయింపులు 6.53 శాతం పెంపు

న్యూఢిల్లీ:  మన రక్షణ రంగం మరింత బూస్ట్  అయింది. ఆపరేషన్  సిందూర్  నేపథ్యంలో 2026–27 కేంద్ర బడ్జెట్ లో డిఫెన్స్ కు రూ.7,84,678 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ (2025–26) లో రక్షణ రంగానికి  రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి దానిని 15 శాతం పెంచారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయుధాల ఆధునీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. 

మొత్తం కేటాయింపుల్లో మూలధన వ్యయం కింద (క్యాపిటల్  ఎక్స్ పెండిచర్) సాయుధ బలగాలకు రూ.2,19,306 కోట్లు అలొకేట్  చేశారు. ఈ మూలధన వ్యయంతో బలగాలు.. కొత్త ఆయుధాలు, ఎయిర్ క్రాఫ్ట్ లు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ హార్డ్ వేర్ ను కొనుగోలు చేస్తాయి. ప్రస్తుత బడ్జెట్  మూలధన వ్యయం (రూ.1.80 లక్షల కోట్లు) కన్నా ఈసారి క్యాపిటల్  ఎక్స్ పెండిచర్  రూ.39 వేల కోట్లు ఎక్కువ. 

2025–26 బడ్జెట్ లో సవరించిన మూలధన వ్యయం రూ.1,86,454 కోట్లు. ప్రస్తుత మూలధన వ్యయంలో ఎయిర్ క్రాఫ్ట్, ఎయిరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.63,733 కోట్లు కేటాయించగా.. యుద్ధనౌకలకు రూ.25,023 కోట్లు అలాట్  చేశారు. ఇక, రెవెన్యూ ఆదాయాన్ని రూ.5,53,668 కోట్లుగా అంచనా వేశారు. అందులో రూ.1,71,338 కోట్లు పెన్షన్లు ఉన్నాయి. ఈసారి పెన్షన్  కేటాయింపులను 6.53 శాతానికి పెంచారు.

విమానాల విడి భాగాలపై బీసీడీ మినహాయింపు

ట్రైనింగ్, సివిలియన్, ఇతర ఎయిర్ క్రాఫ్ట్ లకు వాడే స్పేర్ పార్టులపై బేసిక్  కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలని నిర్ణయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు. అలాగే డిఫెన్స్  సెక్టార్ లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్  కు వాడే ఎయిర్ క్రాఫ్ట్ ల విడిభాగాల తయారీకి కూడా బేసిక్  కస్టమ్స్  డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చామని నిర్మల వెల్లడించారు. 

రాజ్​నాథ్  సింగ్  హర్షం

రక్షణ రంగంలో కేటాయింపులపై ఆ శాఖ మంత్రి రాజ్​నాథ్  సింగ్  హర్షం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కు రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆపరేషన్  సిందూర్  నేపథ్యంలో ఈ బడ్జెట్​తో డిఫెన్స్ కు మరింత బూస్ట్  దొరికింది. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న మన తీర్మానం కూడా బలోపేతం అయింది. 

అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, వారి కుటుంబాలకూ ప్రాధాన్యం ఇచ్చాం. ఎక్స్ సర్వీస్ మెన్  కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్  కింద రూ.12,100 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ తో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ.