- మంచిర్యాలలో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణంలో జాప్యం
- ప్రస్తుతం జీజీహెచ్ ఐసీయూలోనే తాత్కాలిక సేవలు
- న్యూరోసర్జన్, కార్డియాలజిస్ట్ డాక్టర్లు లేక తిప్పలు
- మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కాలేజీ రోడ్డులో రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ బిల్డింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం ఐబీ చౌరస్తాలో ఉన్న ఓల్డ్ జీజీహెచ్ ఐసీయూలోనే క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ సరైన సౌలత్లు లేక, బెడ్లు సరిపోక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక ఐసీయూ, ఎమర్జెన్సీ మెడిసిన్, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్ వంటివి ఒకేచోట లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. స్పెషలిస్టు డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండాలి. కానీ న్యూరోసర్జన్, కార్డియాలజిస్ట్ లేరు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. అంతదూరం వెళ్లేసరికి గోల్డెన్ అవర్ దాటిపోతోంది. పేషెంట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
గోల్డెన్ అవర్‌లో ట్రీట్మెంట్ అందితేనే..
రోడ్డు యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్స్, గర్భిణుల అత్యవసర సమస్యలు లాంటి సందర్భాల్లో మొదటి గంట గోల్డెన్ అవర్. ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కు ఎంతో కీలకం. క్రిటికల్ కేర్ విభాగం పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడే అవకాశాలు మెరుగవుతాయి. జిల్లాలో జరిగే రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. యాక్సిడెంట్లలో తీవ్ర గాయాలై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని జీజీహెచ్‌కు తరలిస్తుంటారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిరొంచ ప్రాంతాల నుంచి సైతం అత్యవసర వైద్యం కోసం మంచిర్యాలకు వస్తుంటారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో సరైన వసతులు లేక అత్యవసర వైద్యం అవసరమైన రోగులను కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నారు. కాలేజీ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న జీజీహెచ్, క్రిటికర్ కేర్ విభాగాలు అందుబాటులోకి వస్తే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, సిరొంచ ప్రాంతానికి చెందిన వారికి మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
ఆధునిక సదుపాయాలతో నిర్మాణం
మంచిర్యాలలో 50 పడకల కెపాసిటీతో క్రిటికల్ కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇందులో 10 ఐసీయూ, ఆరు హైడిపెండెన్సీ యూనిట్లు, 24 ఐసోలేషన్ బెడ్స్, నాలుగు ఎమర్జెన్సీ బెడ్స్, రెండు ఐసోలేషన్ రూములు, రెండు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, మరో రెండు లేబర్ డెలివరీ రికవరీ(ఎల్డీఆర్) వంటి అధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రెండు డయాలసిస్ బెడ్లు, ఒక డెడికేటెడ్ ల్యాబ్, ఆక్సిజన్ సప్లై సిస్టమ్ వంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆర్థోపెడిక్, న్యూరోసర్జన్, ప్లాస్టిక్ సర్జన్లు, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, అనస్థీషియా డాక్టర్, ఇతర నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. తద్వారా ఎమర్జెన్సీ కేసులకు మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. పనులు త్వరగా చేపట్టి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తామని నేతలు చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితులు కనిపించడంలేదు.
