ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. 2018 నాటి కేసులో సమన్లు

ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. 2018 నాటి కేసులో  సమన్లు


ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఊహించని షాక్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. 2018 నాటి పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసింది.  దాదాపు 8 ఏండ్ల తర్వాత కోర్టు సమన్లు పంపించడం ధృవ్ రాఠీకి షాకింగ్ విషయం.  అక్టోబర్ 17న తదుపరి విచారణ నిర్వహించనున్నట్లు కోర్టు తెలిపింది.

బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు వికాస్ పాండే  2018లో దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో సాకేత్ కోర్టులోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాహుల్ జైన్ అక్టోబర్ 12న ఈ ఆదేశాలు ఇచ్చారు. ధృవ్ రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తున్నప్పటికీ, ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని, సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చారని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది సమక్ష్ శర్మ కోర్టుకు తెలిపారు. అందువల్ల సమన్లు జారీ చేయాల అభ్యర్థించారు.

గురుగ్రామ్‌లోని ధృవ్ రాఠీ అడ్రెస్ కు  సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారు ప్రాసెస్ సర్వర్‌తో పాటు వెళ్లి సమన్లు అందజేసే అవకాశం కూడా ఇచ్చింది. చాలా ఏళ్లుగా ఫిర్యాదుదారు   సమన్లు అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2019 జూలై 23న మొదటి సారి సమన్లు జారీ చేశారు అని కోర్టు పేర్కొంది. విచారణను నవంబర్ 20 నుంచి అక్టోబర్ 17కు ముందుకు తీసుకొచ్చింది.

కేసు ఏమిటి?

ధృవ్ రాఠీ 2018 మేలో తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన  బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2  వీడియోపై ఈ కేసు నమోదైంది. ఆ వీడియోలో వికాస్ పాండే మహావీర్ ప్రసాద్‌కు 50 లక్షల రూపాయలు ఇచ్చి, బీజేపీ ఐటీ సెల్ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తోందనని ఆరోపించినట్లు చెబుతున్నారు. ఇవి అబద్ధాలని, నిరాధారమైన దూషణలుగా  వికాస్ పాండే ఆరోపించారు. అదే వీడియోను అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్‌లో షేర్ చేయడంతో ఆయనపై కూడా కేసు వేశారు. కేజ్రీవాల్‌పై కేసు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాఠీపై కేసు మాత్రం కొనసాగుతోంది.

ధృవ్ రాఠీ ప్రస్తుతం భారత్‌లో ఉన్న సమయంలోనే ఈ లేటెస్టుగా సమన్లు వెలువడటం గమనార్హం. అక్టోబర్ 17న కోర్టులో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.