న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న కాంగ్రెస్ చేపట్టనున్న భారీ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణకు అవసరమైన నో అబ్జెక్షన్ (ఎన్వోసీ) సర్టిఫికేట్‌ను కాంగ్రెస్‌కు పోలీసులు జారీ చేశారు. ఢిల్లీ సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ రోహిత్ రాజ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో నిరసన ర్యాలీ నిర్వహణ అనుమతి కోసం కాంగ్రెస్ పార్టీ పోలీసులను ఆశ్రయించింది.
అక్టోబర్ 25 నుంచి 3 మధ్య రామ్ లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వాహణ ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీకి ఎన్వోసీ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలిపారు. సరైన శాంతిభద్రతల ఏర్పాట్లు, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, ప్రతిపాదిత ర్యాలీ సజావుగా జరిగేలా చూసేందుకు నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర సంబంధిత ఏజెన్సీలతో తాము నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.
పోలీసులు జారీ చేసిన ఎన్వోసీని రామ్ లీలా మైదాన్ స్థల యాజమాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)కు అందజేసి కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపారు. కాగా, సర్ ప్రక్రియలో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఈవీఎంలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ నిరసన ర్యాలీ చేపట్టనుంది.
