లేడీస్ షాపింగ్ అంటే మగాళ్లు అగ్ని పరీక్ష. ఒక పట్టాన పూర్తవ్వదు. అంతేనా ఆ బ్యాగులు మోయటం అనేది ఉంది చూడండీ.. గల్లీ గల్లీలో తిరుగుతూ బ్యాగులు మోస్తూ.. దేవుడా అనని మగాడే ఉండడు.. షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే షాపు నుంచి మరో షాపు ఇలా తిరుగుతూ ఆ బ్యాగులు మోయటం ఏదైతే ఉందో అది చాలా కష్టం.. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ.. ఢిల్లీలో ఓ స్టార్టప్ కంపెనీ పుట్టింది. దాని పేరు క్యారీమెన్. మీరు హ్యాపీగా షాపింగ్ చేస్తూ ఉండండి.. మీ బ్యాగులు మేం మోసిపెడతాం అంటూ పుట్టుకొచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
షాపింగ్ కు వెళ్లే మహిళలకు ఇది మరింత సులభతరం చేస్తుంది. వీళ్ల ఛార్జీలు చూస్తే అర గంటకు 79 రూపాయలు, గంటకు 119 రూపాయలు, 2 గంటలకు 199 రూపాయలు.. 3 గంటలకు 289 రూపాయలు, 4 గంటలకు 600 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
ఈ క్యారీమెన్స్ ఏం పని చేస్తారు అంటే.. కస్టమర్ ఎక్కడ అయితే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఏరియాలో వీళ్లను బుక్ చేసుకోవాలి. క్యారీమెన్ వచ్చినప్పటి నుంచి సర్వీస్ ను బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. మీ క్యారీ బ్యాగులు అన్నీ మోస్తూ.. మీకు సహాయం చేస్తారు. రద్దీ ఏరియాల్లో మీకు సెక్యూరిటీగానూ ఉంటాడు.
ఒక్క క్యారీ బ్యాగులు మోయటమే కాదు.. మీరు చెల్లించే ధరలు ఆధారంగా మరిన్ని సేవలు ఉన్నాయి. మీకు చిన్న పిల్లలు ఉంటే షాపింగ్ సమయంలో వాళ్లను ఎత్తుకోవటం.. మీ పిల్లలను ఉంచే బేబీ ప్రామ్స్ చూసుకోవటం, మొబైల్ ఛార్జింగ్, గొడుగులు, మడతపెట్టే కుర్చీలు వంటి సదుపాయాలను సైతం అందిస్తారు ఈ క్యారీమెన్స్. అంతేకాదండీ ఫుడ్ కోర్టుల మీ బదులు వాళ్లు క్యూలో నిల్చుంటారు.
షాపింగ్ లో టెన్షన్ ఫ్రీ.. మీ భుజాల భారం తగ్గించుకోండి.. మీ చేతుల బరువు తగ్గించుకోండి.. రద్దీ రోడ్లపై హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అంటూ ప్రచారం చేస్తోంది ఈ కంపెనీ. క్యారీమెన్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అవసరాలను అవకాశాలుగా సృష్టించుకోవటం అంటే ఇదే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. మన బరువు మనమే మోయలేని రోజులకు వచ్చామా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లేడీస్ షాపింగ్ కు వెళ్లేటప్పుడు సాయం కోసం భర్తను, పిల్లలు, బంధువులు, చుట్టాలను రమ్మని పిలుస్తుంటారు. ఎందుకో తెలుసా బ్యాగులు మోయటానికి.. అక్కడా ఇక్కడా తిరగటానికి, సాయం చేయటానికి.. ఈ క్యారీమెన్ రావటంతో ఈ బాధలు అన్నీ తప్పినట్లే అంటున్నారు మహిళలు.
ఏదిఏమైనా ఢిల్లీలాంటి సిటీలో షాపింగ్ చేయాలంటే క్యారీమెన్ అవసరమే అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. క్యారీమెన్ బ్యాగులు మోయటమే కాదు.. మన భుజాలపై పెద్ద భారాన్ని దించుతున్నాడు అంటూ ఫ్యామిలీమెన్స్, పెళ్లయిన భర్తలు కామెంట్స్ చేయటం ఫన్నీగా అనిపిస్తోంది.
ఒకప్పుడు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో మన బ్యాగులు మోయటానికి కూలీ అని పిలిచేవాళ్లం కదా.. కూలీలను చూశాం.. ఆధునిక కాలంలో వీళ్లు క్యారీమెన్స్ గా మారిపోయారు అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. ఏదిఏమైనా క్యారీమెన్ స్టార్టప్ ఐడియా ఆన్ లైన్ లో ఆసక్తిగా ఉంది..
