ఆధ్యాత్మికం: వారాహి నవరాత్రి ఉత్సవాలు..శత్రువులు ఉండరు.. భూ సమస్యలు పరిష్కారం.. పూజా విధానం ఇదే.. !

ఆధ్యాత్మికం:  వారాహి నవరాత్రి ఉత్సవాలు..శత్రువులు ఉండరు.. భూ సమస్యలు పరిష్కారం..  పూజా విధానం ఇదే.. !

వారాహి దేవి నవరాత్రులను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, వీటినే "ఆషాఢ గుప్త నవరాత్రులు" అని కూడా అంటారు.ఈ ఏడాది 2026 లో ఈ నవరాత్రులు జూలై 15 బుధవారం నుంచి  జూలై 23గురువారం వరకు 9 రోజుల పాటు జరగనున్నాయి. అమ్మవారిని ఎలాపూజించాలి.. ఎందుకు పూజించాలి.. ఏ సమయంలో పూజించాలి.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయి  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రులలాగే ఈ ఆషాఢ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సమయంలో లలితా త్రిపుర సుందరి దేవి సేనాధిపతి అయిన శ్రీ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

ఎవరీ వారాహి దేవి?

సేనాధిపతి: శ్రీ లలితా దేవి సర్వ సైన్యానికి వారాహి దేవి కమాండర్-ఇన్-చీఫ్ (సైన్యాధిపతి). లలితా సహస్రనామంలో ఈమెను 'దండనాథ' అని కీర్తించారు.

స్వరూపం: సప్తమాతృకలలో ఈమె అత్యంత శక్తివంతమైన దేవత. విష్ణుమూర్తి వరాహ అవతారానికి సంబంధించిన స్త్రీ శక్తి రూపమే వారాహి దేవి. ఈమె వరాహ (పంది) ముఖంతో, చేతిలో హలము (నాగలి), దండం ధరించి భక్తులను రక్షిస్తూ ఉంటుంది.

రక్షణ కవచం: భక్తులకు ఎదురయ్యే శత్రు భయాలు, కోర్టు సమస్యలు, ఆస్తి లేదా భూ వివాదాలు మరియు వ్యాపారంలో అడ్డంకులను తొలగించడంలో ఈమెను మించిన దైవం లేదు.

"గుప్త" నవరాత్రులు అంటే ఏమిటి

'గుప్త' అంటే రహస్యం. శరన్నవరాత్రులలాగా వీటిని అందరికీ తెలిసేలా పబ్లిక్‌గా కాకుండా, భక్తులు తమ ఇంట్లోనే చాలా నిగూఢంగా, నిశ్శబ్దంగా మరియు అత్యంత నిష్ఠతో మంత్ర సాధన చేస్తారు.ముఖ్యంగా తాంత్రికులు, సాధకులు, దేవి ఉపాసకులు తమ కుండలినీ శక్తిని పెంచుకోవడానికి ఈ 9 రోజులు కఠినమైన సాధన చేస్తారు.

పూజా విధానం మరియు సమయం

రాత్రి పూజ:  వారాహి దేవిని రాత్రి సమయాలలో పూజించడం అత్యంత శ్రేష్ఠం. సాధారణంగా రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య చేసే పూజలు, జపాలు అమ్మవారికి త్వరగా చేరుతాయి.

దీపారాధన: పూజా గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి వారాహి అష్టోత్తరం, వారాహి కవచం లేదా మూలమంత్రాన్ని పఠించాలి.

విశేష తిథి (పంచమి): ఈ 9 రోజులలో వచ్చే ఆషాఢ శుద్ధ పంచమి (జూలై 19) తిథి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు చేసే పూజకు అనంతమైన ఫలితం దక్కుతుంది.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు: వారాహి దేవి భూమికి అధిపతి కాబట్టి, భూమి లోపల పండే దుంపలు మరియు ఘాటైన పదార్థాలు ఆమెకు మహా ప్రీతి.

  • పులిహోర లేదా చక్కర పొంగలి.
  • ఉడకబెట్టిన చిలగడదుంపలు (గెనుసు గడ్డలు) లేదా కందగడ్డ.
  • నల్ల మినపప్పుతో చేసిన గారెలు.
  • దానిమ్మ పండ్లు లేదా పానకం, వడపప్పు

 లభించే ఫలితాలు

శత్రు విజయం:మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు శాంతిస్తారు. మీపై ఉన్న నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి.

భూ వివాదాల పరిష్కారం:ఇల్లు కట్టుకోవడంలో అడ్డంకులు ఉన్నా లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమస్యలు, కోర్టు కేసులు ఉన్నా అవి త్వరగా తొలగిపోతాయి.

ధైర్యం & ఆత్మవిశ్వాసం: భయపడే స్వభావం ఉన్నవారికి మానసిక ధైర్యం, ధీరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆషాఢ గుప్త నవరాత్రులలో పెద్దగా ఆడంబరాలు లేకుండా, ఇంట్లోనే ప్రతిరోజూ ఒక దీపం వెలిగించి, దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.