ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? తండ్రి కస్తూరి రాజా సంచలన వ్యాఖ్యలు!

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? తండ్రి కస్తూరి రాజా సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్ స్టార్ ధనుష్ త్వరలోనే పాలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమిళనాడు రాజకీయ పీఠాన్ని టార్గెట్ చేస్తూ అడుగులు వేయబోతున్నారా? అంటే అవుననే టాక్ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది.  తమిళనాట సినిమాకి, రాజకీయాలకి ఉన్న లింక్ ఈనాటిది కాదు. ఎంజీఆర్, జయలలిత నుంచి నిన్నటి విజయ్ వరకు వెండితెరపై మెరిసిన ఎందరో మహానుభావులు.. రాజకీయాల్లోకి వచ్చి రారాజులుగా వెలిగారు. మరి ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ధనుష్ సొంతం కాబోతోందా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.

హింట్ ఇచ్చిన తండ్రి..

లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ధనుష్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మీడియా అడిగిన ప్రశ్నకు కస్తూరి రాజా సమాధానం ఇచ్చారు. ఆయన ఈ అవకాశాన్ని అస్సలు కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది. భవిష్యత్తులో నా కుమారులు మాత్రమే కాదు.. నా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటూ ఒక రేంజ్ హింట్ ఇచ్చారు. ఈ ఒక్క మాటతో కోలీవుడ్ వర్గాల్లో, ధనుష్ అభిమానుల్లో పూనకాలు మొదలైపోయాయి.

ధనుష్ అసలు పేరు ఏంటంటే?

ఈ వేదికపై కస్తూరి రాజా తమ ఫ్యామిలీ పడిన కష్టాలను, సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 'తుళ్ళువదో ఇళమై' సినిమాతో మొదలైన కష్టం, సెల్వరాఘవన్ లాంటి క్రేజీ డైరెక్టర్‌ని, ధనుష్ లాంటి గ్లోబల్ స్టార్‌ని ఇండస్ట్రీకి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. సినిమాల్లోకి వచ్చాకే పేరు మార్చుకున్నాడు. ఈరోజు ఎయిర్‌పోర్ట్స్‌లో , పబ్లిక్ ప్లేసెస్‌లో నా కొడుకును అందరూ ధనుష్ కె. రాజా అని పిలుస్తుంటే ఒక తండ్రిగా నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది అని ఆనందం వ్యక్తం చేశారు.

 నెక్స్ట్ ఏంటి?

ప్రస్తుతం ధనుష్ కేవలం నటుడిగానే కాదు.. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తూ బిజీగా ఉన్నాడు. అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఒకవైపు చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న  ఈ యంగ్ హీరో.. భవిష్యత్తులో నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం తమిళ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయం అని ఫ్యాన్స్ , రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.