'దూత సీజన్ 2' గ్రాండ్ లాంచ్.. ప్రొడ్యూసర్‌గా మారిన చైతూ, క్లాప్ కొట్టిన నాగార్జున!

'దూత సీజన్ 2' గ్రాండ్ లాంచ్.. ప్రొడ్యూసర్‌గా మారిన చైతూ, క్లాప్ కొట్టిన నాగార్జున!

అక్కినేని అభిమానులకు, వెబ్ సిరీస్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. 2023లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై.. మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో ప్రేక్షకులను వణికించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'దూత'. నాగచైతన్య డిజిటల్ డెబ్యూగా వచ్చిన ఈ సిరీస్ అప్పట్లో ఒక సంచలనం. ఇప్పుడిక ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సెకండ్ చాప్టర్ రెడీ అయిపోయింది. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో 'దూత సీజన్ 2' అధికారిక పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది.

నాగార్జున బ్లెస్సింగ్స్..

ఈ పూజా వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రయూనిట్‌కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అయితే ఈ సీజన్-2లో అసలైన క్రేజీ ట్విస్ట్ ఏంటంటే.. మొదటి సీజన్‌లో కేవలం నటుడిగా అలరించిన నాగచైతన్య, ఈ రెండో సీజన్‌తో 'నిర్మాత'గా కొత్త అవతారమెత్తుతున్నారు. కథపై, దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రిప్ట్‌పై ఉన్న నమ్మకంతోనే చైతూ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు..

మళ్ళీ అదే మ్యాజిక్.. అదే టీమ్!

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ ఫొటోలను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  'దూత సెకండ్ చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నందుకు, అలాగే ప్రొడ్యూసర్‌గా నా మొదటి అడుగు పడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'దూత-2 కూడా సూపర్ హిట్ అవ్వాలి అన్నా' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి సీజన్‌ను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ పార్ట్-2ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. శరత్ మరార్‌తో కలిసి చైతన్య ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఒరిజినల్ కాస్ట్‌లోని పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీజన్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే ఇది స్ట్రీమింగ్ కానుంది.

చైతూ లైనప్ .. 

ఇటీవలే సాయి పల్లవితో కలిసి నటించిన రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ మూవీ 'తండేల్'తో మెప్పించిన నాగచైతన్య, ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ గ్యాప్‌లోనే 'దూత 2'ని కూడా పట్టాలెక్కించి చైతూ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు.