Health tips:ఎండకు వెళ్లి వచ్చారా..! అలసటగా ఉందా! డీహైడ్రేషన్ కు గురయ్యారేమో ఇలా తెలుసుకోండి

Health tips:ఎండకు వెళ్లి వచ్చారా..! అలసటగా ఉందా! డీహైడ్రేషన్ కు గురయ్యారేమో ఇలా తెలుసుకోండి

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు అలసటగా అనిపించడం సహజం. అయితే, అది కేవలం అలసట మాత్రమేనా లేక మీ శరీరం డీహైడ్రేషన్ కు గురైందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం తగ్గిందని చెప్పే కొన్ని ముఖ్యమైన లక్షణాలు  ఇంట్లోనే చిన్న పరీక్షలు చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.


డీహైడ్రేషన్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?..

స్కిన్ టర్గర్ టెస్ట్ ద్వారా.. మీ చేతి వెనుక భాగంలో ఉన్న చర్మాన్ని రెండు వేళ్లతో పట్టుకుని కొంచెం పైకి లాగి వదలండి. చర్మం వెంటనే యథాస్థానానికి వెళ్తే మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నట్లు. చర్మం నెమ్మదిగా వెనక్కి వెళ్తే లేదా అలాగే నిలబడి ఉంటే మీ శరీరంలో నీటి శాతం చాలా తగ్గిందని అర్థం.డీహైడ్రేషన్ కు గురైనట్లు గుర్తించాలి. 

డీహైడ్రేషన్ ప్రధాన లక్షణాలు

మీరు ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఈ క్రింది మార్పులను గమనించండి..  తీవ్రమైన దాహం, నోరు  ఎండిపోవడం, మూత్రం రంగు మారడం, తలతిరగడం, చర్మ పొడిబారిపోవడం, అలసట, నీరసం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. 

తీవ్రమైన దాహం: నీళ్లు తాగినా దాహం తీరకపోవడం 

నోరు ఎండిపోవడం: నోరు, నాలుక జిగటగా లేదా పొడిగా మారడం.

మూత్రం రంగు మారడం: మూత్రం తక్కువగా రావడం ,అది ముదురు పసుపు రంగులో ఉండటం డీహైడ్రేషన్ కి అతిపెద్ద సంకేతం.

తల తిరగడం లేదా తలనొప్పి: మెదడుకు అందాల్సిన నీరు అందకపోతే తల భారంగా అనిపిస్తుంది.

చర్మం పొడిబారడం: చెమట పట్టడం ఆగిపోయి, చర్మం వేడిగా ఉండటం.

అలసట,నీరసం: ఏ పని చేయలేనంతగా శరీరం సహకరించకపోవడం.

గుండె వేగం పెరగడం: శ్వాస వేగంగా తీసుకోవడం లేదా గుండె కొట్టుకునే వేగం పెరగడం.

తక్షణమే ఏం చేయాలి?..

ఒకవేళ మీరు డీహైడ్రేషన్‌కు గురైనట్లు అనిపిస్తే.. కేవలం మామూలు నీళ్లు కాకుండా ORS కలిపిన నీటిని తాగండి. కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను తక్షణమే అందిస్తుంది. మజ్జిగ తాగితే శరీర వేడిని తగ్గించి హైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గం.  పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి.  ఒకవేళ వాంతులు అవుతున్నా, స్పృహ కోల్పోయినట్లు అనిపించినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి.

►ALSO READ | అతిగా నీళ్లు తాగుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే.. డాక్టర్లు ఏమంటున్నారంటే..!