వాతావరణాన్ని బట్టి ఒక 81 అంతస్తుల బిల్డింగ్ దాని ఆకారాన్ని మార్చుకుంటుందంటే ఎవరైనా నమ్ముతారా..? మొదట ఇది ఏదో మాయ అనుకోవచ్చు... కానీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉండే వరల్డ్ ఫెమస్ 'ఈఫిల్ టవర్' విషయంలో ఇది నిజంగానే జరుగుతుంది.
ఒక చిన్న సైన్స్ సూత్రం వల్ల ఈ అద్భుతమైన కట్టడం ఎత్తులో మార్పులు వస్తుంటాయి. దాదాపు 41 సంవత్సరాల పాటు, 1,083 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా ఈఫిల్ టవర్ రికార్డు సృష్టించింది. వాతావరణాన్ని బట్టి ఈ భారీ టవర్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం....
వేసవిలో పెరుగు.. చలికాలంలో తగ్గుతు
ఈఫిల్ టవర్ ఎత్తు ప్రతి సంవత్సరం దాదాపు 15 సెంటీమీటర్ల వరకు మారుతూ ఉంటుందని మీకు తెలుసా ?
ఎండకాలంలో ప్యారిస్ నగరంలో ఎండలు మండిపోతూ, ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు... ఈ టవర్ ఎత్తు 12 నుండి 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అదే చలికాలంలో వాతావరణం బాగా చల్లబడినప్పుడు, దీని ఎత్తు కొన్ని సెంటీమీటర్లు తగ్గిపోతుంది.
దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి
ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని సైన్స్ భాషలో ఉష్ణ వ్యాకోచం (Thermal Expansion) అంటారు. స్కూల్లో మనం ఒక సూత్రం నేర్చుకునే ఉంటాం... ఏదైనా ఒక పదార్థం వేడెక్కినప్పుడు అది సాగుతుంది, చల్లబడినప్పుడు దగ్గరకు ముడుచుకుంటుంది.
ఈఫిల్ టవర్ పూర్తిగా ఇనుముతో కట్టింది. ఎండ తీవ్రతకు ఆ ఇనుము వేడెక్కి సాగడం వల్ల టవర్ ఎత్తు కొద్దిగా పెరుగుతుంది. నిజానికి ప్రపంచంలోని అన్ని వస్తువులకూ ఈ రూల్ వర్తిస్తుంది. కానీ ఈఫిల్ టవర్ చాలా భారీగా ఉండటం వల్ల, అందులో జరిగే కొన్ని సెంటీమీటర్ల మార్పును కూడా మనం స్పష్టంగా కొలవగలుగుతున్నాం.
ఎత్తు పెరగడమే కాదు..
ఉష్ణోగ్రత ప్రభావం కేవలం టవర్ ఎత్తు మీదే కాదు, దాని ఆకారం మీద కూడా పడుతుంది. ఎండ బాగా ఉన్నప్పుడు సూర్యకిరణాలు టవర్ కి ఒక వైపే నేరుగా తగులుతాయి. అప్పుడు ఆ భాగం మాత్రమే బాగా వేడెక్కి సాగుతుంది. దీనివల్ల టవర్ రెండో వైపుకు కొద్దిగా వంగుతుంది. అయితే ఈ వంపు చాలా స్వల్పంగా ఉండటం వల్ల మన కంటికి నేరుగా కనిపించదు.
ఇప్పటికీ తగ్గని క్రేజ్..
సైన్స్‌కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాలతో పాటు, ఈ అద్భుతమైన కట్టడాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. పగటి పూట ఒకలా, రాత్రి వేళ రంగురంగుల లైట్ల వెలుతురులో మరొకలా కనిపించే ఈఫిల్ టవర్ అందం ఎప్పటికీ ప్రత్యేకమే!
