మీకు తెలుసా : ఒకే ఊరు రెండు దేశాల్లో ఉంది.. అనగనగా ఒక అద్భుతమైన ఊరు కథ..!

మీకు తెలుసా : ఒకే ఊరు రెండు దేశాల్లో ఉంది.. అనగనగా ఒక అద్భుతమైన ఊరు కథ..!

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు రెండు దేశాల మధ్య ఉంది. ఆ ఊళ్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు అరవై మంది భార్యలు. ఆ రాజుతో సహా అక్కడి ప్రజలంతా ఒక దేశంలో తిని, మరో దేశంలో నిద్ర పోతారు. ఇదంతా కథ కాదు. నిజమే. ఇలాంటి ఊరు ఒకటి ఉంది. అది కూడా మనదేశంలోనే. పేరు 'లాంగ్వా'. ఇక్కడ నివసించే ప్రజలు, వాళ్లు చేసుకునే పండుగలు, వాళ్ల ట్రెడిషన్ చాలా భిన్నంగా ఉంటాయి. ఈ విచిత్ర గ్రామం గురించి ఇంకిన్ని సంగతులివి.

 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే అందుకోసం ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి డబ్బు సమకూర్చుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీలు, ప్రయాణాల కోసం బుకింగ్, అక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పైగా వేల కిలో మీటర్ల జర్నీ. అలాంటి తలనొప్పులేం లేకుండా ప్రతి రోజూ ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్లగలిగితే ఎలా ఉంటుంది ? భలే ఉంటుంది కదూ. అలాంటి అనుభూతి పొందాలంటే ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మన దేశంలో ఉన్న లాంగ్వా  అనే ఊరికి వెళ్తే చాలు.

 వీసా లేకుండా, పైసా ఖర్చు పెట్టకుండా రెండు దేశాల్లో తిరగొచ్చు. ఎలాగంటారా ? ఈ ఊరు మనదేశ సరిహద్దులో ఉంది. కచ్చితంగా చెప్పాలంటే నాగాలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. రెండు దేశాల సరిహద్దులో ఉండడం వల్ల రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది ఈ ఊరి వాళ్లకి. అందుకే ఈ గ్రామ ప్రజలు రెండు దేశాల్లో తిరుగుతుంటారు. ప్రతి రోజూ ఏదో ఒక పని మీద దేశ సరిహద్దులు దాటుతుంటారు వాళ్లు. ఇక్కడ నివసించే వాళ్ల తెగ పేరు కొన్యాక్. వీళ్లు ఒకప్పుడు అందరిలా సామాన్య జీవనం గడిపేవాళ్లు
కాదు.

ఇతర తెగలకు సంబంధించిన వాళ్లు కనిపిస్తే వెంటాడి, వేటాడి తల నరికేవాళ్లు. వాళ్లని 'హెడ్ హంటర్స్' అని పిలుస్తారు. అది వాళ్ల గొప్పతనం అనుకునేవాళ్లు. వాళ్లు అలా చంపినప్పుడల్లా ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుని సంబురాలు చేసుకుంటారు. ఇది వాళ్ల ట్రెడిషన్లో భాగం అంటారు.1960ల వరకు ఈ గ్రామంలో హెడ్ హంటింగ్ జరిగేది. అందుకే ఈ గ్రామంలోని కొన్ని కుటుంబాల దగ్గర పుర్రెతో చేసిన దండలు ఇప్పటికీ ఉంటాయి. అందుకనే మిగతావాళ్లు వీళ్లని చాలా ప్రమాదకరమైన మనుషులుగా చూస్తారు. నాగాలాండ్ ప్రజలతో వీళ్లు చాలా బాగా కలిసిపోతారు. ఇక్కడ కొంతమంది స్థానికులు మయన్మార్ సైన్యంలో కూడా ఉన్నారు. ఈ ఊళ్లో తయారైన నల్లమందు మయన్మార్ మీదుగా సరిహద్దులు దాటుతుందని చెప్తుంటారు. వాళ్ల ఒంటి మీద పచ్చబొట్లు, అలంకరణ వస్తువులు, కొమ్ములు ఉంటాయి. మెడలో ఇత్తడితో తయారుచేసిన పుర్రె బొమ్మలుండే దండలు వేసుకుంటారు. అవి వేసుకోవడం వల్ల పిల్లలు పుడతారని వాళ్ల నమ్మకం.


ఏమేం చేయొచ్చు? 
లాంగ్వా గ్రామంలో ప్రశాంత వాతావరణం, పచ్చదనం ఆకట్టుకుంటుంది. వీటితోపాటు, దోయాంగ్ నది, షిలోయ్ సరస్సు, నాగాలాండ్ సైన్స్ సెంటర్, హాంకాంగ్ మార్కెట్ వంటి టూరిస్ట్ ప్లేస్లు ఇక్కడ చాలా ఉన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ సరిహద్దు కూడా వెళ్తుండటంతో టూరిస్ట్లు ఈ గ్రామానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఏప్రిల్ మొదటివారంలో 'ఎఒలింగ్' అనే పండుగ జరుపుకుంటారు. ఆ తెగలో ఇది ఫేమస్ ఫెస్టివల్.

చింద్విన్ నది, బ్రహ్మ పుత్ర నదులు వేద శిఖరం మీదుగా వెళ్తాయి. ఇది మోన్ జిల్లాలో ఉన్న ఎత్తయిన కొండ. దీని చుట్టూ మంచు కప్పి ఉంటుంది. కింద అంతా పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తుంది. చెనొయిషా అనేది ఒక ఊరు. ఇక్కడ పురాతన కళకు సంబంధించిన, అలంకరణ వస్తువులు ఉంటాయి. మనుషుల పుర్రెలు కూడా కనిపిస్తాయక్కడ. కొన్యాక్ తెగ కల్చర్కు సంబంధించిన వస్తువులు, నగలు, బట్టలు చాలా చూడొచ్చు.

70 గ్రామాలపై రాజుకు అధికారం
 కొన్యాక్ తెగకు ఒక రాజు ఉంటాడు. ఆయనకు 60 మంది భార్యలు ఉంటారు. ఆయన ఇల్లు మనదేశం, మయన్మార్ దేశాల మధ్య ఉంది. ఆయన అక్కడ ఎందుకు కట్టుకున్నాడు ? అంటారేమో. ఆయన అలా కట్టుకోలేదు. ఆయన ఇల్లు ఉన్న చోటు నుంచే రెండు దేశాల దారులు వేరయ్యాయి. అందుకే ఆయన ఇల్లు రెండు దేశాల మధ్యలో ఉంటుంది. వంట గది మనదేశంలో ఉంటే, బెడ్ రూమ్ మయన్మార్ ఉంటుంది. ఈయన ఒక్కడి ఇల్లే కాదు. ఇక్కడ చాలామంది ఇండ్లు అలాగే ఉంటాయి. అందుకనే వాళ్లని “ఒక దేశంలో తిని, మరో దేశంలో పడుకుంటారు. ఒకేరోజు రెండు దేశాల్లో ఉండగలరు” అని చెప్తుంటారు. కొన్యాక్ తెగ రాజు ఆ ఒక్క ఊరికే కాదు, మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్లోని 70 గ్రామాలకు రాజే. ఆ గ్రామాలన్నీ ఈ రాజు కనుసన్నల్లోనే ఉంటాయి. 

రెండుగా చీలడం వల్లే
ఈ గ్రామం నుంచి వెళ్లే ఇండియా, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు కొన్ని ఇండ్లను రెండుగా విభజిస్తుంది. అంటే.. కిచెన్ ఒక దేశంలో ఉంటే.. బెడ్ రూమ్ మరోదేశంలో ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంత ప్రజలకు రెండు దేశాల సిటిజన్ షిప్ ఉంది. గ్రామంలో ఆదివాసి, కోయ గిరిజనుల జనాభే ఎక్కువ. వీరంతా తమ జీవన ఉపాధి కోసం.. రోజువారీ పనుల కోసం తరచూ రెండు దేశాల సరిహద్దు దాటుతుంటారు.


ఎలా వెళ్లాలి?

లాంగ్వా గ్రామానికి వెళ్లాలంటే ముందు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్కు వెళ్లాలి. అక్కడి నుంచి మోన్ నగరానికి వెళ్లాలి. అక్కడి నుంచి లాంగ్వా గ్రామం సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోన్ కారు అద్దెకు తీసుకుని లాంగ్వా వెళ్లొచ్చు. అక్టోబర్ నుంచి మార్చి వరకు లాంగ్వా వెళ్లడానికి బెస్ట్ టైం.


టారో సూపర్
లాంగ్వా ప్రజలు చేసుకునే వంటల్లో టారో కూర బాగుంటుందట. టారో అంటే ఏంటో అనుకునేరు... చామగడ్డ కూర. దాంతోపాటు లేత వెదురు మొలకలు, కాల్చిన పంది మాంసం తింటారు. అన్నం, చట్నీ బాగా తింటారు. అంతేకాకుండా స్ట్రాంగ్ రెడ్ టీ తాగడం వాళ్లకు చాలా ఇష్టం.