హైదరాబాద్లో ఉంటున్నారా..? వీకెండ్ వస్తే పిల్లలను తీసుకెళ్లడానికి సిటీలో ఇన్ని ప్లేసులు ఉన్నాయా..?

హైదరాబాద్లో ఉంటున్నారా..? వీకెండ్ వస్తే పిల్లలను తీసుకెళ్లడానికి సిటీలో ఇన్ని ప్లేసులు ఉన్నాయా..?

పిల్లలు రోజూ ఉదయాన్నే లేచి, స్నానాలు చేసి అమ్మ రెడీ చేసిన వేడి వేడి టిఫిన్​ తిని, ఇస్త్రీ చేసిన యూనిఫాం వేసుకుని, బ్యాగులు భుజాన తగిలించుకుని పరుగుపరుగున స్కూళ్లకు వెళ్తుంటే.. వాళ్ల హడావిడి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుందో!​ ఇదంతా ఓకే. కానీ సాయంత్రానికి పిల్లలు వాడిపోయిన మొహాలతో అలసిపోయి ఇంటికి వస్తుంటారు. ఇలాగే కొనసాగితే పిల్లలు ఒత్తిడికి గురవ్వడం సహజం. 

వాళ్లకు ఒకింత ఊరట కలిగించేలా కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అందుకే సిటీలో సరికొత్త ఎంటర్​టైన్​మెంట్ సెంటర్స్ వెతుకుతున్నారు పేరెంట్స్. వాటిలో  కిడ్స్​ ప్లే జోన్స్​ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికెళ్తే వారమంతా చదువుల్లో మునిగిపోయే పిల్లలకు వీకెండ్ ఒక చిన్న పండుగలా అనిపిస్తుంది. 

ఒకప్పుడు పిల్లల ప్రపంచం వీధులే. కబడ్డీ, కోకో, దాగుడుమూతలు వంటి ఆటలు స్నేహం, శారీరక దృఢత్వం, టీం స్పిరిట్​ను పెంచేవి. కానీ ఇప్పుడు అదే వినోదం ఇండోర్ ప్లే జోన్లు, పికిల్‌‌బాల్ కోర్టులు, ట్రాంపొలైన్ పార్క్​లు, గేమింగ్ సెంటర్ల రూపంలోకి మారింది. సేఫ్టీ, మోడర్న్​ ఫెసిలిటీస్​, సిటీ లైఫ్​ స్టైల్​ కారణంగా పిల్లల ఆటల వేదిక మారిపోయింది. అయితే లక్ష్యం మాత్రం మారలేదు. ఆనందం, ఆరోగ్యం, స్నేహబంధాలు. కాలంతోపాటు ఆటల రూపం మారినా, ఆటల విలువ మాత్రం అలాగే కొనసాగుతోంది.

వినోదాన్ని అందిస్తున్న పిల్లల గేమ్ జోన్లు
* మాదాపూర్‌‌లోని ప్లే ‘ఎన్’ లెర్న్, జూబ్లీ హిల్స్‌‌లోని పీకజూ ప్లేహౌస్ వంటి కేంద్రాలు పిల్లల క్రియేటివిటీ పెంచే ప్రోగ్రామ్స్​, ఆర్కేడ్ గేమ్‌‌లను అందిస్తున్నాయి. ఖాజాగూడలోని క్రియేటివ్ స్క్వేర్ -ఆల్ట్ ప్లే డిస్కవరీ క్రియేటివ్​ గేమ్​గా ఫేమస్​. గచ్చిబౌలిలోని క్రేజీ కిడ్జీ ప్లే అండ్ పార్టీ అనే ప్లే జోన్‌‌లో మినీ రేస్ ట్రాక్, ఇసుక గుంట, నటనా ఆటలు అందుబాటులో ఉన్నాయి.

* హైటెక్ సిటీలోని ఇ-గ్యాలెరియా మాల్‌‌లో ఉన్న గేమ్ ఎక్స్‌‌ట్రీమ్ క్రికెట్ సిమ్యులేటర్లు, 360- డిగ్రీల వీఆర్ రోలర్‌‌ కోస్టర్‌‌లు, బౌలింగ్ అల్లేలకు ప్రసిద్ధి. స్కై సైక్లింగ్, జిప్-లైనింగ్, బంపర్ కార్లు వంటివి అందిస్తారు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్​లోని టైమ్‌‌జోన్​లు 60కి పైగా విభిన్నమైన ఇమ్మర్సివ్ వీఆర్ గేమ్‌‌లు, కార్నివాల్ క్లాసిక్స్, కాంపిటేటివ్ బౌలింగ్‌‌ ఉన్న ఒక అల్టిమేట్ మాసివ్ ఆర్కేడ్ గేమ్స్​ ఉన్నాయి. సత్వా నెక్లెస్ మాల్ ర్చువల్ రియాలిటీ పాడ్‌‌లు, క్లాసిక్ క్లా-మెషిన్ గేమ్‌‌లతో కూడిన అత్యంత ఇంటరాక్టివ్ సెంటర్.

* ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్​లో ఉన్న పిట్ స్టాప్ క్రేజీ కిడ్జీ బర్త్ డే పార్టీలు జరుపుకునేందుకు అనువైన స్థలం. ఈ కేంద్రంలో15 రకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. ఈ గేమింగ్ సెంటర్​లో గో కార్టింగ్, బౌలింగ్, స్కై సైక్లింగ్, జిప్ లైన్, ఏటీవీ బైక్, జిరో రైడ్, రైఫిల్ షూటింగ్ యాక్టివిటీస్ చిన్నారులకు ఫన్ అందిస్తున్నాయి.

ఇండోర్ ప్లే ఏరియాలు..
* వర్షాల సీజన్‌‌ను దృష్టిలో ఉంచుకుని ఇండోర్ ప్లే ఏరియాలతోపాటు అవుట్‌‌డోర్ లొకేషన్లను పిల్లల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. డూ సైన్స్.. పిల్లలు ఆడుకుంటూ సైన్స్ సూత్రాలను ఈజీగా నేర్చుకోవడానికి అద్భుతమైన లెర్నింగ్ స్పేస్. ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, లైఫ్-సైజ్ పరికరాలు, వీఆర్ ఆస్ట్రానమీ షోలు ఇక్కడ ప్రత్యేకం. సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ లోపల థ్రిల్ సిటీ వర్చువల్ రియాలిటీ సెంటర్, గేమింగ్ ఇష్టపడే పిల్లలను ఆకట్టుకుంటోంది.

* ఇనార్బిట్ మాల్లోని ఫన్‌‌ సిటీలో పసిపిల్లల నుంచి పెద్దపిల్లల కోసం ఉత్కంఠభరితమైన ఇండోర్ వినోదపు రైడ్‌‌లు, ఆర్కేడ్ గేమ్‌‌లు, బంపర్ కార్లను అందుబాటులో ఉంచారు. కొండాపూర్​లోని ప్లే2 గ్రో పిల్లలకు శారీరక, మేధోపరమైన ఆటలు నిర్వహించడంలో పాపులర్. బంజారాహిల్స్​లోని జంగిల్ జిమ్ ఇండోర్ ప్లే జోన్ అద్భుతమైన సాఫ్ట్- ప్లే స్పేస్​. జూబ్లీహిల్స్ ఒడిస్సీ మాల్​లో మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్​, పసిపిల్లల కోసం ఇండోర్ ఆట స్థలాన్ని రెడీ చేశారు.

హైదరాబాద్ కిడ్జ్ రన్
* హైదరాబాద్లో పిల్లల కోసం పలు కిడ్స్ జోన్లు ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. కుటుంబం మొత్తానికి ఫిట్‌‌నెస్‌‌ను ప్రోత్సహించే లక్ష్యంతో జులై12వతేదీన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అవుట్‌‌డోర్ మారథాన్ జరగనుంది. బేగంపేటలోని థ్రిల్ సిటీ ట్రాంపొలైన్, నింజా కోర్స్, వీఆర్ గేమ్స్, ఇండోర్ అడ్వెంచర్ యాక్టివిటీలతో ఈవెంట్​లు చేస్తోంది. కోకాపేట జోన్ హైదరాబాద్లో ట్రాంపొలైన్ పార్క్, జిప్‌‌లైన్, క్లైంబింగ్, అడ్వెంచర్ గేమ్స్ నిర్వహించనున్నారు.

* బంజారాహిల్స్లోని ఫంకీ మంకీ ప్లే సెంటర్ సాఫ్ట్ ప్లే, బాల్ పిట్, క్లైంబింగ్ యాక్టివిటీలను చేపట్టనున్నారు. దీంతోపాటు సిటీలో పిల్లల కోసం వర్క్‌‌షాప్‌‌లు, స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సైన్స్ షోలు వంటి ఈవెంట్లు ఈ నెలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ కూడా జరగబోతోంది. సిటీలో ఉండే పిల్లలకు ఇవన్నీ క్రేజీ ఎక్స్​పీరియెన్స్​ని ఇవ్వబోతున్నాయి. ఇక వీకెండ్ అంటే పిల్లలకు ప్లే టైమ్​! వారమంతా చదువుల ఒత్తిడిలో ఉండే పిల్లలకు వీకెండ్‌‌లో కొంత సమయం స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. 

డిజిటల్ స్క్రీన్ల నుంచి బయటకు..
* డిజిటల్ స్క్రీన్ల నుంచి పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు వెతుకుతున్న ప్రత్యామ్నాయాలు ఈ కిడ్స్ జోన్లు అని చైల్డ్ సైకాలజీ డాక్టర్లు చెప్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ అంటే క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ మాత్రమే గుర్తొచ్చేది.

ఇప్పుడు పికిల్‌‌బాల్, ప్యాడెల్ టెన్నిస్ వంటి కొత్త ఆటలు సిటీలో పాపులర్​ అవుతున్నాయి. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా కలిసి ఆడేందుకు ఈ సెంటర్స్​ వీలు కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయం దొరుకుతుంది. శారీరక దృఢత్వం, ఏకాగ్రత, టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతాయి.

* స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో.. ఆట కూడా అంతే ముఖ్యం అంటున్నారు పిల్లల డాక్టర్​లు. అయితే వినోదంతోపాటు భద్రత కూడా చూసుకోవాలి. ఆట పరికరాల నిర్వహణ, శిక్షణ పొందిన సిబ్బంది, పరిశుభ్రత, ప్రథమ చికిత్స సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కిడ్స్ జోన్లను ఎంచుకోవాలని ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు.

టాప్ 5 ట్రెండింగ్ యాక్టివిటీస్
ట్రాంపొలైన్ పార్క్​లు, పికిల్‌‌బాల్, ప్యాడెల్ టెన్నిస్, వర్చువల్ రియాలిటీ గేమ్స్, ఇండోర్ అడ్వెంచర్ కోర్సులు.