Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్‌పై దిల్ రాజు ఓపెన్ కామెంట్స్.. ఇన్ని తప్పిదాలు జరిగాయా?

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్‌పై దిల్ రాజు ఓపెన్ కామెంట్స్.. ఇన్ని తప్పిదాలు జరిగాయా?

టాలీవుడ్‌లో హీరోల భారీ రెమ్యునరేషన్లపై ప్రముఖ నిర్మాత, TFDC ఛైర్మన్‌ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. సినిమాల బడ్జెట్‌లు పెరగడానికి ప్రధాన కారణం హీరోల పారితోషికాలేనని అన్నారు. రూ.300 కోట్ల సినిమా బడ్జెట్‌లో 35 నుంచి 40 శాతం వరకు హీరో రెమ్యునరేషన్‌కే వెళ్తోందని చెప్పుకొచ్చారు. అయితే, రెమ్యునరేషన్ తగ్గిస్తే మార్కెట్‌లో తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ప్రశంసించిన దిల్ రాజు.. టాలీవుడ్‌లో కూడా అలాంటి విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కలెక్షన్ పోస్టర్లలో చూపించే సంఖ్యలు, వాస్తవ వసూళ్ల మధ్య తేడా నిర్మాతలకు తెలుసని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను భారీ బడ్జెట్తో నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్లాప్కి గల కారణాలు సైతం చెప్పుకొచ్చారు. 

గేమ్ ఛేంజర్ సినిమా పూర్తవ్వడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టడం, ఎన్నికల నేపథ్యంలో ఉన్న కథను ఆలస్యంగా ఎలక్షన్లు ముగిసిన తర్వాత విడుదల చేయడం ఆలస్యంగా విడుదల చేయడం వల్ల ఆడియన్స్‌తో కనెక్టివిటీ దెబ్బతిందని చెప్పారు. ఇక కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులకు ఇప్పటికే చూసిన ఫీలింగ్ కలగడం కూడా సినిమాకు మైనస్ అయ్యిందన్నారు. ముఖ్యంగా సినిమాలోని నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ, కంటెంట్ బలంగా లేకపోతే ఎంత భారీ బడ్జెట్ పెట్టిన ఉపయోగం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇలా భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, విజువల్ గ్రాండియర్ ఉన్నప్పటికీ కంటెంట్ లోపిస్తే సినిమా సక్సెస్ అవ్వడం కష్టమని ‘గేమ్ ఛేంజర్’ మరోసారి నిరూపించిందన్నారు.

అలాగే ఎడిటింగ్ దశలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, అగ్రిమెంట్‌లో కొన్ని అంశాలను ముందుగానే స్పష్టంగా రాసుకోకపోవడం తన తప్పిదమని అంగీకరించారు. ‘గేమ్ ఛేంజర్’ తన కెరీర్‌లో ఒక తప్పటడుగు అని పేర్కొన్న ఆయన, ఈ సినిమా వల్ల భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడిన ఈ లేటెస్ట్ పాడ్‌కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇదిలా ఉంటే.. 2025 సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో భారీ అంచనాలతో ప్రేక్షుకుల ముందుకొచ్చిన ‘గేమ్ ఛేంజర్’ భారీ డిజాస్టర్ మూట కట్టుకుని దిల్ రాజుకు నష్టాలను తీసుకొచ్చింది. అంతేకాకుండా పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్లకి తీరని నష్టాలు కూడా వచ్చాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో నిర్మాత దిల్ రాజు దాదాపుగా సేఫ్ అయ్యారు.