లోకల్ ఐడెంటిటీతో గ్లోబల్ సక్సెస్

లోకల్ ఐడెంటిటీతో గ్లోబల్ సక్సెస్

డింపు బారువ 1995 ఆగస్టు 6న అస్సాంలోని నల్బారీ అనే చిన్న పట్టణంలో పుట్టాడు. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటపట్టలేదు. అందుకే ఏడో తరగతిలో ఫెయిల్‌‌ అయ్యాడు. మరుసటి సంవత్సరం కష్టపడి చదివి చివరకు 48 శాతం మార్కులతో గట్టెక్కాడు. అప్పటినుంచి చదువు మీద దృష్టి పెట్టి రాణించాడు. చదువు పూర్తయ్యాక టీచర్‌‌‌‌గా ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్లకు సోషల్‌‌ మీడియా మీద ఇంట్రెస్ట్‌‌తో యూట్యూబ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లోనే ‘డింపు బారువా’ పేరుతో చానెల్‌‌ పెట్టినప్పటికీ 2017లో “నల్బారీ టౌన్‌‌ బై సైకిల్‌‌” పేరుతో మొదటి వీడియో అప్‌‌లోడ్‌‌ చేశాడు. ఆ వీడియోకు అనుకున్నంతగా వ్యూస్‌‌ రాలేదు. ఆ తర్వాత చేసిన స్కూల్ వీడియో వైరల్ అయింది.

ఆ వీడియోపై స్థానిక వార్తా పత్రికలో న్యూస్‌‌ కవర్ అయ్యింది. అప్పటినుంచి నల్బారీలోని ఎన్నో సమస్యలపై వీడియోలు చేశాడు. అవి కూడా వైరల్‌‌ అయ్యాయి. చానెల్‌‌కు సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత డింపు 2018 ఏప్రిల్ 14న ‘డింపూస్‌‌ వ్లాగ్స్‌‌’ పేరుతో మరో చానెల్ స్టార్ట్ చేశాడు. అందులో ట్రావెల్ వ్లాగ్స్, విలేజ్ లైఫ్, ఎడ్యుకేషనల్ టాపిక్స్‌‌పై కంటెంట్ బిల్డ్ చేశాడు. డింపు తన ఇంటర్వ్యూలు, రీల్స్‌‌లో తరచూ “నేను చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా. అస్సాంలోని ఒక చిన్న టౌన్‌‌లో కంఫర్ట్ జోన్‌‌లో పెరిగా. ఆ జోన్‌‌ నుంచి బయటికి వచ్చాకే సక్సెస్ అయ్యా” అని చెప్తుంటాడు.  

అస్సామీ యాసలో .

డింపు వీడియోల్లో ఎక్కువగా నల్బారియా యాసలోనే మాట్లాడతాడు. “హే దోస్త్! హే ఫ్రెండ్స్!” అనే అతని సిగ్నేచర్ గ్రీటింగ్‌‌తో వ్లాగ్‌‌ మొదలుపెడతాడు. ఆ మాటలు, యాసే లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకునేలా చేశాయి. సరళమైన మాటలు, హ్యూమర్, అతని పాజిటివ్ ఎనర్జీ.. అస్సాం యువతను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం డింపు డైలీ లైఫ్, ట్రావెల్‌‌ వ్లాగ్స్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అస్సాంలోని గ్రామాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నుంచి ఇండియా–చైనా బార్డర్, లడాఖ్, నేపాల్, థాయ్‌‌లాండ్, దుబాయ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, యూకే, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాల్లో ట్రావెల్‌‌ వ్లాగ్స్‌‌ చేశాడు.

సోషల్ కాజ్‌‌ కోసం లైవ్‌‌లు పెట్టాడు. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌‌లు సేకరించి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. 2020లో అస్సాంలో ఫ్లడ్స్‌‌ వచ్చినప్పుడు యూట్యూబ్ లైవ్‌‌ సూపర్ చాట్ ద్వారా రూ. 43,000 సేకరించి వరద బాధితులకు ఇచ్చాడు. 2021లో గౌహతి మున్సిపల్ కార్పొరేషన్‌‌తో కలిసి వేస్ట్ మేనేజ్‌‌మెంట్ అవేర్‌‌నెస్ వీడియో చేశాడు. మంచితనమే అతన్ని యూట్యూబ్‌‌లో టాప్‌‌లో నిలబెట్టింది. 

మొదటి వ్యక్తిగా రికార్డ్‌‌ 

యూట్యూబ్‌‌ నుంచి 2019 మార్చి 6న సిల్వర్ ప్లే బటన్, 2020 అక్టోబర్ 8న గోల్డ్ ప్లే బటన్ అందుకున్నాడు. అస్సాంలో గోల్డ్ బటన్ అందుకున్న  మొదటి వ్యక్తిగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశాడు డింపు. 2022లో 2 మిలియన్ సబ్‌‌స్క్రయిబర్స్ మార్క్‌‌ని దాటి హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అతని చానెల్‌‌కు 3.36 మిలియన్ సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు. అస్సాంలో ఎక్కుమంది సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్న వ్యక్తిగత చానెల్‌‌ ఇదే. అతని మొదటి చానెల్‌‌ ‘డింపు బారువ’కి 2.22 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో ఎక్కువగా హిందీ కంటెంట్‌‌ అప్‌‌లోడ్‌‌ చేస్తుంటాడు. డింపు ‘బిహు అటాక్’ అనే సినిమాతో బాలీవుడ్‌‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ నటుడు అర్బాజ్ ఖాన్‌‌తో కలిసి స్క్రీన్‌‌ షేర్‌‌‌‌ చేసుకున్నాడు.