బాలకృష్ణతో పీరియాడికల్ మూవీ.. భారీగా ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్టర్

బాలకృష్ణతో పీరియాడికల్ మూవీ.. భారీగా ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాఠీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లితో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరో కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బాలకృష్ణ. ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు రాహుల్ సంకృత్యన్. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు తన తరువాతి సినిమా కోసం భారీ పీరియాడికల్ కథను సిద్ధం చేసుకున్నాడట. ఇటీవలే ఆ కథను బాలకృష్ణకు వినిపించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశారని సమాచారం. కథ, కథనాలు చాలా కొత్తగా ఉండటంతో వెంటనే ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట బాలయ్య. రాహుల్ కూడా ఈ కథకు బాలయ్య అయితేనే బాగుంటుందని ముందు ఆయనకే చెప్పారట. అలా ఈ క్రేజీ కాంబో సెట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  

భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని, ఈ ప్రాజెక్టు కు సంబందించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం బాబీతో చేస్తున్న సినిమా కంప్లీట్ అవగానే రాహుల్ సినిమాను మొదలుపెట్టనున్నారట బాలయ్య. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య కొత్త సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.