
ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమాను తీయడం, అదికూడా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉందంటు న్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. రామ్ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరి నిర్మిస్తోన్న ఈ మూవీ బుధవారం విడుదలవుతోన్న సందర్భంగా మోహన్ రాజా ఇలా ముచ్చటించారు. ‘హనుమాన్ జంక్షన్’ తర్వాత తెలుగులో నేను చేసిన సినిమా ఇది. ఈ ఇరవై ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు సినిమాలకు మాత్రం దగ్గరగానే ఉన్నాను. ఎందుకంటే ఆరు తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేశాను. ఇక ‘ధృవ’ సీక్వెల్ గురించి రామ్ చరణ్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫిర్’ రీమేక్ ప్రస్తావన వచ్చింది. దర్శకుడిగా నా పేరును నిర్మాత ఎన్వీ ప్రసాద్ సూచించారు. దాంతో చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారు. వెంటనే ఒరిజినల్ వెర్షన్ మరోసారి చూసి, మూడు రోజులు దానిపై వర్క్ చేసి ఓ కొత్త పాయింట్‌ను చెప్పాను. అది చిరంజీవి గారికి చాలా నచ్చింది. కథ పాతదే అయినా కొత్తగా చెబితే కచ్చితంగా మెప్పిస్తుంది. అందుకే కథను మాత్రమే మలయాళం నుంచి తీసుకుని ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేశా.
తెలుగు ప్రేక్షకులకు అవి కచ్చితంగా నచ్చుతాయి. ‘లూసిఫర్’ను చెడగొడుతున్నారని కొందరంటున్నారు. నేను ఆ సినిమాకు బిగ్గెస్ట్ లవర్‌ని. నాకంటే దాన్ని ఎక్కువ ఎవరూ ప్రేమించి ఉండరు. మరోసారి ఒరిజినల్ చూసి ఈ సినిమాకు వచ్చినప్పటికీ నచ్చుతుంది. అందుకే మలయాళంలోనూ రిలీజ్ చేస్తున్నాం. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల పాటు చిరంజీవి గారి ప్రెజెన్స్ ఉంటుంది. సెట్‌లో ఆయన చాలా హంబుల్‌గా ఉంటారు. ఇక చిరంజీవి గారి తర్వాత ఇందులో అంతగా పేరొచ్చేది సత్యదేవ్‌కే. సల్మాన్ ఖాన్‌ను తీసుకోవడానికి కన్నింగ్ గేమ్ ఆడాను. ఆ పాత్రకు పెద్ద స్టార్ కావాలి కానీ చిరంజీవి గారి ఇంట్లోని హీరోలను వద్దన్నాను. రామ్ చరణ్‌కి సల్మాన్ క్లోజ్ అని తెలుసుకుని ఆయనతోనే దీనికి ఒప్పించాం. ఇక నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్, షఫీ, బ్రహ్మాజీ, సముద్రఖని, దివి, అనసూయ, పూరిజగన్నాథ్.. క్యారెక్టర్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. పూరి గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం లక్కీ. సీక్వెల్‌పై జరుగుతోన్న ప్రచారం నాకూ తెలిసింది. ప్రస్తుతానికైతే దాని గురించి మేం ఆలోచించడం లేదు. నాగార్జున, అఖిల్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఉంటుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తాను. చిరంజీవి గారి ‘హిట్లర్’లో చిన్న పాత్ర చేసిన నేను, ఆయన్ను డైరెక్ట్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూలా ఫీలవుతున్నా.