భగవంత్ కేసరి.. దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే ఉంది : రాఘవేంద్రరావు

భగవంత్ కేసరి.. దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే ఉంది :  రాఘవేంద్రరావు

బాలయ్య బాబుకు  సీజన్‌‌తో సంబంధం లేదని, ‘భగవంత్ కేసరి’ విడుదలైన అన్ని థియేటర్స్‌‌లో  దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే ఉందని అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌‌తో సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతోందని  బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్‌‌ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మూవీ టీమ్‌‌కి షీల్డ్స్‌‌ను అందజేసి బాలయ్య బాబు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలని కోరారు. 

బాలకృష్ణ మాట్లాడుతూ ‘మంచి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టడానికి మించిన సంపాదన, సంతోషం జీవితంలో మరేది ఉండదు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్‌‌తో మరోసారి ఆ అదృష్టం దక్కింది. మూడు తరాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.

ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాన్నగారి నుంచి నాకొచ్చింది’ అని అన్నారు. ఇంత గొప్ప విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానంది శ్రీలీల. తన కెరీర్‌‌‌‌లోనే గొప్ప సినిమాగా నిలిచిందన్నాడు అనిల్ రావిపూడి. సక్సెస్ అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని నిర్మాతలు, తమన్ చెప్పారు.