హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్న చిత్రం ‘దీవాన’. సమ్మర్‌లో సినిమా రిలీజ్ కానుంది. మంగళవారం ఈ చిత్రంలోని లవ్ సాంగ్‌ను హీరోయిన్ సమంత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందిని రెడ్డి అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని కోరారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ కథ విన్న తర్వాత వారం రోజుల దాకా అదే ఆలోచనలో ఉండిపోయాను. నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా ‘దీవాన’ అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాతో నా లైఫ్ మారుతుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.
ప్రేక్షకుల మనసుల్ని తాకే ప్రేమ కథ ఇదని హీరోయిన్ స్నేహ మణిమేగలై చెప్పింది. ఇదొక హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ అని, ఇందులో బ్యూటిఫుల్ క్లైమాక్స్ చూస్తారని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చెప్పాడు. ప్రతి తెలుగు అబ్బాయి ఎమోషనే ఈ చిత్రమని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
