క్వార్టర్స్ లో లేకున్నా HRA కటింగ్..మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్ సిబ్బంది ఆవేదన

క్వార్టర్స్ లో లేకున్నా HRA కటింగ్..మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్ సిబ్బంది ఆవేదన
  • 426 క్వార్టర్లలో 310 శిథిలం... 
  • బయట రెంట్​కు ఉంటున్న సిబ్బంది
  • వాటన్నింటిని తొలగించి కొత్త క్వార్టర్స్​ నిర్మించాలని డిమాండ్ 
  • పది రోజుల్లోపు స్పందించకుంటే హైకోర్టుకు వెళ్తామంటున్న సిబ్బంది 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ తెలంగాణ స్పెషల్​ పోలీస్​ బెటాలియన్​లో 25 ఏండ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి నివాసయోగ్యంగా లేకపోవడంతో కొన్నేండ్లుగా సిబ్బంది బయట రెంట్​కు ఉంటున్నారు. అయినప్పటికీ తమకు హెచ్​ఆర్​ఏ నెలకు రూ.6వేలు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు 310 క్వార్టర్లు శిథిలావస్థకు చేరితే కేవలం 164 క్వార్టర్స్​ తొలగించి కొత్తగా నిర్మించాలని ఇటీవల నిర్ణయించినట్లు తెలిసింది. వీటితో పాటు మిగతా క్వార్టర్లను కూడా తొలగించి అన్నీ కొత్తగా నిర్మించాలని సిబ్బంది డిమాండ్​ చేస్తున్నారు. దీనిపై పది రోజుల్లో ఉన్నతాధికారులు స్పందించకపోతే తమకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. 

25 ఏండ్ల కిందట నిర్మాణం

గుడిపేటలోని బెటాలియన్‌‌‌‌లో 48 బ్లాక్​లలో 426 క్వార్టర్స్‌‌‌‌ఉండగా, ఇందులో 2001లో నిర్మించినవి 310 వరకు ఉన్నాయి. బెటాలియన్​లో సుమారు 800 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో సగం మందికి క్వార్టర్స్​ కేటాయించగా, మిగతా వారు బయట రెంట్​కు ఉంటున్నారు. 

వారికి హెచ్​ఆర్​ఏ చెల్లిస్తున్నారు. 25 ఏండ్ల కిందట నిర్మించిన వాటిలో అనేక క్వార్టర్స్‌‌‌‌ ఏండ్ల కిందటే శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 164 క్వార్టర్స్​ను మాత్రమే ఖాళీ చేయాలని నిర్ణయించడంపై సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

2001లో నిర్మించిన క్వార్టర్స్‌‌‌‌ ఒకే నిర్మాణ కాలానికి చెందినవి అయినప్పుడు కొన్ని క్వార్టర్స్‌‌‌‌ మాత్రమే ప్రమాదకరంగా, మరికొన్ని సురక్షితంగా ఉన్నాయని చెప్పడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక బ్లాక్‌‌‌‌లో సుమారు 12 క్వార్టర్స్‌‌‌‌ ఉండగా, నిర్మాణం పరస్పరం అనుసంధానమై ఉన్నందున మొత్తం బ్లాక్‌‌‌‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

పలు క్వార్టర్స్​  స్లాబ్‌‌‌‌లు దెబ్బతిని, గోడలు నెర్రెలుపడి ఎప్పుడు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొన్నది. ఈ సమస్యపై ఇప్పటికే 13వ బెటాలియన్ ఉన్నతాధికారులకు, హౌసింగ్ కార్పొరేషన్​ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పరిష్కారం లభించలేదని సిబ్బంది వాపోతున్నారు.