దీపావళి పండక్కి 2 వారాల సెలవులా..! ఎక్కడంటే?

దీపావళి పండక్కి 2 వారాల సెలవులా..! ఎక్కడంటే?

దీపావళికి 2 వారాలు స్కూళ్లకు సెలవులు ఏంటి సామీ అని ఆశ్చర్యపోయేలా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు దీపావళి పండుగ సందర్భంగా సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. దీంతో విద్యార్థులు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మహారాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన 2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూళ్లకు నవంబర్ 2వ తేదీ సోమవారం నుంచి నవంబర్ 14వ తేదీ శనివారం వరకు దీపావళి సెలవులు కొనసాగనున్నాయి. మధ్యలో వచ్చే ఆదివారాలతో కలుపుకుని దాదాపు 2 వారాల పాటు స్కూళ్లు బంద్ ఉండనున్నాయి. నవంబర్ 6న ధనత్రయోదిశి, నవంబర్ 10న దీపావళి పాడ్వా, నవంబర్ 11న భాబీజ్ వంటి ముఖ్యమైన పండుగ తేదీలు ఈ సెలవుల్లోనే వచ్చాయి.

ఈ సెలవులు ముగిసిన తర్వాత నవంబర్ 16వ తేదీ సోమవారం నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. అంతకుముందు జూన్ 15న ప్రారంభమైన మొదటి సెమిస్టర్ అక్టోబర్ 31తో ముగియనుంది. ఇక రెండో సెమిస్టర్ నవంబర్ 16 నుంచి 2027 మే 1 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాత మే 3 నుంచి జూన్ 14 వరకు వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖ కొన్ని కఠిన నిబంధనలను కూడా పెట్టింది. సెకండరీ స్కూల్ కోడ్ ప్రకారం సంవత్సరంలో మొత్తం సెలవులు 76 రోజులకు మించకూడదని, పాఠశాలలు కనీసం 230 పనిదినాలను పూర్తి చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. పాఠశాలలు తమంతట తాముగా ఈ సెలవుల షెడ్యూల్‌ను మార్చుకోవడానికి వీల్లేదని.. స్థానిక పండుగలు, క్రిస్మస్ వంటి వాటి కోసం తేదీలను సర్దుబాటు చేయాలంటే ముందుగా విద్యాశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఈ సెలవుల ప్రకటన ముందుగానే వెలువడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పండుగ ప్రయాణాలను, ఫ్యామిలీ ట్రిప్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు చక్కటి అవకాశం లభించింది. పండుగ వేళ పిల్లలతో కలిసి సరదాగా గడపాలని భావించే కుటుంబాలకు ఇది నిజంగా ఎంతో ఆనందాన్నిచ్చే విషయమనే చెప్పాలి.