వెలుగు ఓపెన్ పేజీ : డీకే లాంటి సీఎంలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారా?

వెలుగు ఓపెన్ పేజీ :  డీకే లాంటి సీఎంలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారా?

కర్నాటక  ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను  సీఎం  పదవి నుంచి తప్పించి  డిప్యూటీ  సీఎం డీకే  శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ముఖ్యమంత్రిగా 
కాంగ్రెస్​ అధిష్టానం ఎంపికచేసినప్పుడు అది జాతీయ వార్తగా  నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  వాస్తవానికి  డీకే శివకుమార్  రాజకీయ  వ్యూహంతో,  చాతుర్యంతో  ధైర్యాన్ని  ప్రదర్శించి కర్నాటక  ముఖ్యమంత్రి  పదవిని  చేపట్టారు.

2028 ఎన్నికలలో  కర్నాటకలో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను  అపూర్వమైన రీతిలో  వరుసగా  రెండోసారి  డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అధికారంలోకి  తీసుకురాగలరా అన్నదే  ఇప్పుడున్న  కీలక ప్రశ్న.  శివకుమార్  ఒక అసాధారణమైన రాజకీయ నాయకుడు,  రాజకీయ చాకచక్యం గల వ్యక్తి.  డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌కు అధికారం ఉంది, కానీ ఆయన  ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కర్నాటకలో జరిగే  ప్రతి ఎన్నికలలో  కులం  ఒక  నిర్ణయాత్మక అంశంగా  మారిపోయింది.  శివకుమార్  వొక్కలిగ  కులానికి  చెందినవారు.  ఆయనకు  అతిపెద్ద  సవాలు లింగాయత్ సమాజం నుంచే ఎదురవుతోంది.  మొత్తం 224 మంది  ఎమ్మెల్యేలలో 56 మంది లింగాయత్‌‌‌‌‌‌‌‌లే ఉన్నారు. అంతేకాకుండా, అనేక ఇతర శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తు కూడా లింగాయత్‌‌‌‌‌‌‌‌ల మద్దతుపైనే ఆధారపడి ఉంది.  లింగాయత్‌‌‌‌‌‌‌‌లు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఇదే  శివకుమార్‌‌‌‌‌‌‌‌కు  అతిపెద్ద సవాలు.  లింగాయత్‌‌‌‌‌‌‌‌లు సాధారణంగా ఎన్నికల మధ్య తమ రాజకీయ మద్దతును  మార్చుకుంటారు. 

ప్రభుత్వ వ్యతిరేకత

కర్నాటకలో  సీఎం డీకే  శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సారథ్యంలోని  కాంగ్రెస్  ప్రభుత్వంపై  వ్యతిరేకత  పెరుగుతోంది. ప్రభుత్వ నిధులలో అధిక భాగం ఎన్నికల హామీలను నెరవేర్చడానికే  ఖర్చవుతుండగా,   మౌలిక  సదుపాయాల కల్పనకు చాలా తక్కువ  డబ్బు  మిగులుతోంది.  అదీకాక  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో  జరుగుతున్న  నిశ్శబ్ద  తిరుగుబాట్లను కూడా సీఎం శివకుమార్  ఎదుర్కోవలసి వస్తుండటంతో  రాజకీయ అస్థిరత  నెలకొని ఉంది.  మరోవైపు  హైకమాండ్  కూడా స్పష్టంగా  సహాయకారిగా  నిలవడంలేదు.

సిద్ధరామయ్య సవాలు

డీకే  శివకుమార్ ఆధిపత్యానికి  ప్రధానం మాజీ సీఎం  సిద్ధరామయ్య  నుంచి అతిపెద్ద సవాలు ఎదురవుతోంది.  మంత్రివర్గంలో  తన అనుచరులకు ఎక్కువ  స్థానాలు దక్కించుకోవడంలో  సిద్ధరామయ్య విజయం సాధించగా,  శివకుమార్‌‌‌‌‌‌‌‌ అనుయాయులకు  మాత్రం చాలా తక్కువ దక్కాయి. అయితే, సీఎం డీకే  శివకుమార్ రాజకీయ సామర్థ్యం పట్ల ఉన్న భయాల కారణంగా  ఆయనను  నియంత్రించేందుకు  ఒక  నిశ్శబ్ద ప్రయత్నం జరుగుతోంది.  1983లో  లోక్‌‌‌‌‌‌‌‌దళ్  టికెట్‌‌‌‌‌‌‌‌పై అసెంబ్లీకి ఎన్నికైన సిద్ధరామయ్య అనంతరం  బీజేపీ  మినహా  దాదాపు అన్ని పార్టీలలోనూ పనిచేశారు.  2006 నుంచి ఆయన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో  కొనసాగుతున్నారు. శివకుమార్‌‌‌‌‌‌‌‌కు ఆయనే అతిపెద్ద సవాలు.

శివకుమార్ బలాలు

డీకే  శివకుమార్‌‌‌‌‌‌‌‌కు  ముఖ్యమంత్రి  కావడం ఒక విజయమే.  కానీ 2028లో జరగబోయే  అసెంబ్లీ ఎన్నికలలో  గెలవడానికి ఆయనకు తగినంత సామర్థ్యం ఉందా లేదా అన్నదే  ఆయనకు అతిపెద్ద  పరీక్ష.   డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  విస్తృత ప్రజాదరణ ఉంది.  .ఆయన  ఒక  తెలివైన రాజకీయ నాయకుడు. ఈ నేపథ్యంలో ఒక హద్దు దాటాక డీకే  శివకుమార్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహించలేమని  కాంగ్రెస్  హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు  తెలుసు.   

పూర్తి స్వేచ్ఛ అవసరమా?

2028 ఎన్నికలలో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు  వరుసగా  రెండోసారి విజయాన్ని అందించాలంటే..  పోటీ వర్గాల నిరంతర జోక్యం లేకుండా పాలించడా
నికి, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌కు స్వేచ్ఛ అవసరం.  అలాగే ఢిల్లీ  నుంచి  తరచుగా వచ్చే  పిలుపులు  ఆగిపోవాలి.  కర్నాటక  ఓటర్లను  ఆకర్షించడానికి  ముఖ్యమంత్రి  బహిరంగంగా శక్తిమంతంగా ఉండాలి.  కాంగ్రెస్  హైకమాండ్  ఆయనకు  పూర్తి స్వేచ్ఛ ఇస్తే  శివకుమార్‌‌‌‌‌‌‌‌ సారథ్యంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  వరుసగా  రెండోసారి  గెలిచే అవకాశం ఉంది.  అయితే  సీఎం  డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఉద్దేశపూర్వకంగా  అంతర్గత ఒత్తిళ్లను  రుద్దితే  అప్పుడు  ఆయనకు అతిపెద్ద  రాజకీయ అడ్డంకి  బీజేపీ కాకపోవచ్చు, ఆయన సొంత పార్టీయే  కావచ్చు.  
కాంగ్రెస్​ గెలవాలంటే డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌కు  పూర్తి స్వేచ్ఛ అవసరం.

కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధత

ఏ జాతీయ పార్టీ కూడా రాష్ట్రస్థాయి నాయకుడు హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను  శాసించేవిధంగా మరీ ఎక్కువ శక్తిమంతుడిగా ఎదగడాన్ని కోరుకోదు.  అయితే  ప్రస్తుత  కర్నాటక  సీఎం డీకే  శివకుమార్ విషయంలో కాంగ్రెస్​ అధిష్టానానికి ఒక సమస్య  తలెత్తుతోంది.  శివకుమార్   కెరీర్,   వ్యక్తిత్వం ఆయనను  అసాధారణ శక్తిమంతమైన  ప్రాంతీయ నాయకుడిగా మార్చాయి. అందుకే అధిష్టానం సందిగ్ధంలో పడింది. ఎన్నికల్లో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించగల  శివకుమార్ సామర్థ్యం  వారికి అవసరం,  కానీ  ఆయన మరీ ఎక్కువ శక్తిమంతుడిగా  మారిపోతారేమోనన్న  భయం కూడా ఉంది. అందుకే  కర్నాటకలో ప్రత్యర్థి వర్గాలను ప్రోత్సహించడం కొనసాగుతున్నది.  డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌నుఅదుపు చేయకపోతే  తమను  పక్కన  పెట్టేస్తారేమోనని భయపడే  కర్నాటకలోని  పలు కాంగ్రెస్ వర్గాలు ఢిల్లీ  నాయకత్వాన్ని ఆశ్రయిస్తుంటాయి. అయితే  ఇక్కడ కాంగ్రెస్  అధిష్టానానికి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు.  శివకుమార్‌‌‌‌‌‌‌‌ లాంటి కాంగ్రెస్​ సీఎంలకు  ఎంత స్వేచ్ఛాపూరిత అధికారం  ఉండాలి?  అనేది  కాంగ్రెస్  హైకమాండ్ ఎదుర్కొంటున్న ప్రధాన  ప్రశ్న. మొత్తం మీద సీఎంలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంపై కాంగ్రెస్​అధిష్టానం అంతగా ఇష్టపడదని మాత్రం చెప్పొచ్చు.

- డా. పెంటపాటి పుల్లారావు
పొలిటికల్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.