రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు..కేంద్రం తక్షణ సాయం అందించాలి: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు..కేంద్రం తక్షణ సాయం అందించాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వీటిని ఎదుర్కొనేందుకు కేంద్రం  తక్షణమే ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శనివారం కేంద్ర వ్యవసాయ మంత్రి అధ్యక్షుడిగా జరిగిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో ఆయన పాల్గొని రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఐకార్, వర్సిటీల సిబ్బంది సహకారంతో గ్రామస్థాయిలో దీన్ని చేపడతామన్నారు. పంటల పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, నీటిని సంరక్షించాలని, పంటలు కోతకు వచ్చే వరకు సాగునీరు, విద్యుత్ సరఫరా సజావుగా అందేలా చూడాలని రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మైక్రో ఇరిగేషన్ విస్తరణకు, మధ్యంతర పంటల సాగుకు అవసరమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. వాతావరణ మార్పులతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

మద్దతు ధరతో కొనుగోలు భరోసా

రైతులు పంటల మార్పిడికి ముందుకు రావాలంటే పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై కొనుగోలు భరోసా కల్పించాలని మంత్రి కోరారు. మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా అన్ని ప్రధాన పంటలను 100 శాతం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కింద ప్రస్తుతం ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని కోరారు. యూరియా వినియోగం పెరుగుతున్న దృష్ట్యా, రైతులపై అదనపు భారం పడకుండా సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.