మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ మరోసారి సరికొత్త కథతో సంచలనానికి సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న క్రేజీ స్ట్రైట్ తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara). ఈ సినిమాతో సాత్విక వీరవల్లి నూతన నాయికగా ఎంట్రీ ఇస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
కథా నేపథ్యం
చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండే ఓ అమ్మాయి.. ఆకాశమే హద్దుగా ఎదగాలని, ఏకంగా వ్యోమగామి కావాలని కలలు కంటుంది. కానీ ఆమె చుట్టూ ఉన్న సమాజం మాత్రం ఆ కలలకు కళ్లెం వేయాలని చూస్తుంది. ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం కావాలి. ఇంటి పనులే బాధ్యతలు అన్న పాతకాలపు ఆలోచనలు ఆమెను అడుగడుగునా అడ్డుకుంటాయి. కనీసం ఊరి సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా ప్రోత్సాహం లేని పరిస్థితులు ఎదురవుతాయి. అయినా ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు. ఏదో ఒక రోజు తన లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకంతో ముందుకు సాగుతుంది.
అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆమెను అణచివేయాలని చూసే సమాజానికి వ్యతిరేకంగా, ఆమె కలను తన కలగా మార్చుకుని భుజస్కందాలై నిలిచే భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టారు. భార్య లక్ష్య సాధన కోసం భర్త పడే తపన, అందించే అండదండలు టీజర్‌ను అత్యంత భావోద్వేగంగా, మోటివేషనల్గా మలిచాయి. దుల్కర్, సాత్విక జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంది.
భారీ తారాగణం
గున్నం గంగరాజు అందించిన పదునైన మాటలు, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలమనం చెప్పవచ్చు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. గ్లామరస్ నటి శృతి హాసన్ ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ వంటి టాలీవుడ్ దిగ్గజ బేనర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యున్నత విలువలతో నిర్మిస్తున్నాయి.
కేవలం ప్రేమకథగానే కాకుండా, ఓ అమ్మాయి ఆశయాలకు అండగా నిలిచే భర్త ప్రయాణంగా ఈ చిత్రం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. పాజిటివ్ వైబ్స్‌తో నిండిన ఈ ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ నవంబర్ 20, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
