స్వలింగ సంపర్క సంబంధంలో ఉన్న నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ తండ్రి కాబోతున్నారు. ఆయన స్వలింగ సంపర్క భాగస్వామి, అర్జెంటీనా ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్, నెదర్లాండ్స్ ప్రధాని.. సరోగసీ విధానంలో తమ మొదటి బిడ్డ కోసం చూస్తున్నారు.
ఈ విషయాన్ని నెదర్లాండ్స్ ప్రధాని సోమవారం అధికారికంగా ప్రకటించారు. సరోగసీ తల్లిగా వ్యవహరించి, అండాన్ని దానం చేయడానికి నెదర్లాండ్స్ ప్రధాని స్నేహితుల్లో ఒకరు అంగీకరించడంతో ఈ గర్భం సాధ్యమైందని జెట్టెన్ పార్టీ, డెమోక్రాట్స్ 66 (D66) తెలిపింది.
సరోగసీకి ఒప్పుకున్న మహిళకు ఇప్పటికే పిల్లలు ఉన్నారని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జెట్టెన్, కీనన్లకు సాయం చేశారని ఆ పార్టీ పేర్కొంది. "చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. 2027లో కలుద్దాం, చిన్నారి. మా అండదాతకు, మా సరోగెట్ తల్లి లీసాకు, వారి ఇద్దరి కుటుంబాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీ సహాయం లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు," అని నెదర్లాండ్స్ ప్రధాని, ఆయన స్వలింగ సంపర్క భాగస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
D66 ప్రకారం.. నెదర్లాండ్స్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్స ద్వారా గర్భం దాల్చడం సాధ్యమైంది. ఇది డచ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఆ దేశంలో డబ్బు చెల్లించి చేసే సరోగసీ చట్టవిరుద్ధం. బిడ్డ పుట్టిన తర్వాత తన కుటుంబంతో సమయం గడపడానికి జెట్టెన్ కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన పార్టీ తెలిపింది. అయితే.. పేరంటల్ లీవ్ తీసుకోవాలని ప్లాన్ చేయడం లేదని, కొన్ని రోజులు మాత్రమే నెదర్లాండ్స్ ప్రధాని లీవ్‌లో ఉంటారని ఆయన పార్టీ తెలిపింది.
39 ఏళ్ల నెదర్లాండ్స్ ప్రధాని జెట్టెన్, అర్జెంటీనా అంతర్జాతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు అయిన కీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట 2024 నవంబర్‌లో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే.. జెట్టెన్ ప్రధానమంత్రి అయిన కొద్దికాలానికే వారు తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. 2001లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం నెదర్లాండ్స్. 2025లో జరిగిన నెదర్లాండ్స్ ఎన్నికలలో జెట్టెన్ పార్టీ అనూహ్య విజయం సాధించడంతో జెట్టెన్ డచ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.
