CSK హెడ్ కోచ్ రేసులో డ్వేన్ బ్రావో? కోచింగ్‌పై సూపర్ కింగ్స్ లెజెండ్ ఏమన్నాడంటే!

CSK హెడ్ కోచ్ రేసులో డ్వేన్ బ్రావో? కోచింగ్‌పై సూపర్ కింగ్స్ లెజెండ్ ఏమన్నాడంటే!

CSK Head Coach: క్రికెటర్‌గా విజయవంతమైన కెరీర్ ముగించిన తర్వాత కోచింగ్ ప్రపంచంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. టీ20 క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న డీజే బ్రావో, తాజాగా సూపర్ ఓవర్ పాడ్ అనే పాడ్‌కాస్ట్‌లో తన కోచింగ్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విండీస్ జాతీయ టీ20 జట్టుకి కోచ్ గా పని చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యం అని డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు.  మరీ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా బ్రావో ఛాన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు అతడ్నీ తీసుకునే ఆలోచనలో చెన్నై యాజమాన్యం ఎందుకు లేదో తెలుసా..

టీ20 కోచ్‌గా పనిచేయడమే నా లక్ష్యం: 

పాడ్‌కాస్ట్‌లో భవిష్యత్తులో వెస్టిండీస్ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు బ్రావో స్పందించాడు. ప్రస్తుతం జట్టుకు కోచ్ (డారెన్ సమీ) ఉన్న సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాస్త కష్టమే, కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ బాధ్యతలు చేపడతాను అని ధీమా వ్యక్తం చేశాడు. నేను టెస్టులు లేదా వన్డేలకు కోచ్‌గా ఉండాలనుకోవడం లేదు.. కేవలం టీ20 కోచ్‌గా పని చేయడమే నా టార్గెట్, దానిపైనే నా ప్రధాన శ్రద్ధ ఉంటుందని బ్రావో స్పష్టం చేశాడు. ప్రస్తుత కోచ్ డారెన్ సమీ సపోర్ట్ స్టాఫ్‌లో చేరి పనిచేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని, వెస్టిండీస్‌ జట్టుకు సరైన ప్రణాళికలు, ఆటగాళ్లకు మద్దతు అవసరమని అభిప్రాయపడ్డాడు.

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా బ్రావో వచ్చే అవకాశం?: 

న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించిన తరుణంలో డ్వేన్ బ్రావో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎస్‌కేతో బ్రావోకు ఉన్న సుదీర్ఘ అనుబంధం, టీ20 కోచింగ్‌లో అతనికి ఉన్న అనుభవం వల్ల ఫ్రాంచైజీ అభిమానుల్లో అతడి పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. కానీ పాడ్‌కాస్ట్‌లో అతను మాట్లాడింది తన సాధారణ కోచింగ్ భవిష్యత్తు గురించే తప్ప, సీఎస్‌కే కోచ్ పదవి గురించి పెద్దగా రియాక్ట్ కాలేదు. 

సీఎస్‌కే కోచింగ్ ప్రణాళికలు - ఉన్న సవాళ్లు: 

సీఎస్‌కేతో బ్రావోకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, అతన్ని వెంటనే హెడ్ కోచ్‌గా నియమించడం అంత ఈజీ కాదు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెంటార్‌గా బ్రావో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఐపీఎల్ 2027 ముగిసే వరకు అమల్లో ఉంది. దీంతో సీఎస్‌కే ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సి వచ్చింది. ఐయాన్ మోర్గాన్ పేరు ప్రచారంలోకి రాగా, జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా అల్బీ మోర్కెల్ బాధ్యతలు చేపట్టడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మైకేల్ హస్సీకి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులతో సంబంధాలు వినిపిస్తున్నాయి. త్రిన్‌బాగో నైట్ రైడర్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, అబుదాబి నైట్ రైడర్స్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం బ్రావోకు ఉన్నప్పటికీ, సీఎస్‌కే అన్వేషణ మరొకరి కోసం కొనసాగే అవకాశం ఉంది.