SIR సాఫ్ట్ వేర్ వివరాలను.. ఇచ్చేందుకు నిరాకరించిన ఈసీ!.. RTI ప్రశ్నకు సమాధానం దాటవేత

SIR సాఫ్ట్ వేర్ వివరాలను.. ఇచ్చేందుకు నిరాకరించిన ఈసీ!.. RTI ప్రశ్నకు సమాధానం దాటవేత

ఓటర్ల జాబితాలో తప్పులు, అవకతవకలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వివరాలను వెల్లడించేందుకు భారత ఎన్నికల సంఘం (CEC) నిరాకరించింది. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.ఏ. ముజీబ్ అయ్యూబ్ RTIచట్టం కింద అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసింది. 

జూలై 27న RTI చట్టం కింద దరఖాస్తు చేసి.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ పేరు, వెర్షన్, అల్గారిథం, కృత్రిమ మేధ (AI) వినియోగం గురించి వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఈసీ.. SIR కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆ సమాచారం వాణిజ్య రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించినదని, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(d) కింద మినహాయింపు ఉందని చెప్పడం సరైన సమాధానాన్ని దాటవేసిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో ఓటర్ల పేర్లను చేర్చాలా, తొలగించాలా అనే నిర్ణయాన్ని సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (EROలు) వాస్తవాలు, రికార్డుల ఆధారంగా తీసుకుంటారని చెప్పడం ద్వారా ఈసీ లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. 

ఈసీ సమాధానాలపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పందిస్తూ.. మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత అధికారుల వద్ద అప్పీల్ చేయాలని సూచించారు. SIRలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.