నిమ్మ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్‌‌... ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా...!

నిమ్మ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్‌‌... ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా...!

ఇంటిని శుభ్రపరిచే ఎన్నో క్లీనర్లు మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. అలాంటివాటి నుంచి తమ పిల్లలను కాపాడుకోవాలి అనుకున్నారు ఇద్దరు తల్లులు. అందుకోసం ఎంతో రీసెర్చ్‌‌ చేశారు సోనియా వర్మ, ఫర్హీన్ అలీ. నిమ్మ తొక్కలతో ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ క్లీనర్లను తయారుచేయొచ్చని తెలుసుకున్నారు. వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘అర్తి’ పేరుతో స్టార్టప్‌‌ పెట్టారు. దానిద్వారా ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే మరోవైపు లక్షల్లో సంపాదిస్తున్నారు. 

సో నియా, ఫర్హీన్‌‌ ఇద్దరూ వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినవాళ్లే. కానీ.. ఒకే విధమైన లైఫ్​ స్టయిల్‌‌, ఆలోచనలు ఉండడం వల్ల వాళ్ల లక్ష్యం కూడా ఒక్కటే అయ్యింది. ఫర్హీన్ అలీ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసింది. తనకు పిల్లలు పుట్టినప్పటినుంచి సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకుంది. ఫుడ్‌‌, హెల్త్‌‌.. ఇలా అన్నింటి విషయంలోనూ నేచురల్‌‌ ప్రొడక్ట్స్‌‌ని వాడాలని నిర్ణయం తీసుకుంది. సోనియా వర్మ కూడా కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కెమికల్స్‌‌ ఫ్రీ లైఫ్​ని అలవాటు చేసుకుంది.

తన పిల్లల కోసం ఇంటిని ఒక కెమికల్‌‌ ఫ్రీ వరల్డ్‌‌లా మార్చాలి అనుకుంది. ఈ ఇద్దరూ ముంబైలోనే ఉంటున్నారు. 2019లో ఒక హోమ్‌‌ స్కూలింగ్ కమ్యూనిటీ ద్వారా మొదటిసారి కలుసుకున్నారు. పిల్లలను ఇంట్లోనే చదివించే తల్లుల గ్రూప్‌‌ అది. పిల్లల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై ఇద్దరి ఆలోచనలు కలవడంతో వారి మధ్య స్నేహం బలపడింది. ఆ ఆలోచనలే వాళ్లను వ్యాపార భాగస్వాములను కూడా చేశాయి. 

‘అర్తి’ ఎలా పుట్టింది?

ప్రతిరోజూ ఇళ్లను శుభ్రం చేయడానికి వాడే ఫ్లోర్ క్లీనర్లు, డిష్‌‌వాషర్లు.. లాంటి లిక్విడ్స్‌‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల గురించి ఇద్దరికీ బాగా తెలుసు. అవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే భయం వాళ్లను ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించేలా చేసింది. ఇద్దరూ కలిసి రీసెర్చ్‌‌ చేస్తే ఇంట్లోనే సహజ సిద్ధమైన క్లీనర్లను తయారు చేసుకోవచ్చని తెలిసింది. జ్యూస్‌‌ షాప్‌‌ల వాళ్లు పారేసే నిమ్మకాయ తొక్కలను సేకరించి.. ఒక సింపుల్‌‌ ఫార్ములాను ఉపయోగించి వాటితో బయో-ఎంజైమ్స్ తయారు చేశారు. ఆ ఫార్ములానే ‘అర్తి’కి పునాది వేసింది.

ఇళ్లు మాత్రమే కాదు.. 

‘‘మా లక్ష్యం ఇంటిని శుభ్రపరుచుకోవడమే కాదు.. పర్యావరణాన్ని కాపాడడం. ఇల్లు తుడిచిన తర్వాత ఆ మురికి నీరు డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లి నదుల్లో చేరుతుంది. అందులోని కెమికల్స్‌‌ నీళ్లతోపాటు నేలను కూడా కలుషితం చేస్తాయి” అంటోంది ఫర్హీన్.  భూమిని, నీటిని రక్షించాలనే ఉద్దేశంతోనే 2022 జులైలో వాళ్లు అధికారికంగా ‘అర్తి’ అనే బ్రాండ్‌‌ను లాంచ్ చేశారు. దాని ద్వారా సహజసిద్ధంగా తయారుచేస్తున్న క్లీనర్లను మార్కెట్‌‌లో అమ్ముతున్నారు. 

ఎన్నో నెలల కష్టం.. 

సోనియా, ఫర్హీన్‌‌ తమ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. బయో-ఎంజైమ్ తయారీ అనేది ఒక సహజమైన ప్రక్రియ. నిమ్మ తొక్కలు, బెల్లం, నీటిని కలిపి 90 నుంచి 100 రోజుల పాటు పులియబెట్టి.. ఆ ద్రావణంతో క్లీనర్లను తయారుచేస్తారు. మొదట్లో వాతావరణ మార్పుల వల్ల కొన్నిసార్లు మిశ్రమం పాడైపోయేది. ఈ సమస్యను అధిగమించి నాణ్యమైన క్లీనర్‌‌‌‌ని తయారుచేయడానికి వాళ్లు టెర్రస్ పైన ఎన్నో నెలల పాటు ఓపికగా అనేక ప్రయోగాలు చేశారు. దీనికితోడు ముడిసరుకు సేకరణ మరో సవాలుగా మారింది. నాణ్యమైన నిమ్మ తొక్కలను పెద్ద మొత్తంలో సేకరించేందుకు వాళ్లు స్థానిక జ్యూస్ షాపుల యజమానులతో మాట్లాడారు. తొక్కలను రోజూ సేకరించేలా ఒక నెట్‌‌వర్క్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రొడక్ట్స్‌‌ తయారయ్యాక వినియోగదారుల ఆలోచనలు మార్చి, వాటిని కొనేలా చేసేందుకు కూడా ఎంతో కష్టపడ్డారు.

సైంటిఫిక్ ఇంపాక్ట్

అర్తి నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌‌ అధిక సాంద్రతతో ఉంటాయి. ఒక లీటరు కాన్సంట్రేట్‌‌తో దాదాపు 10 లీటర్ల క్లీనింగ్ లిక్విడ్ తయారవుతుంది. దీనివల్ల చాలా తక్కువ లిక్విడ్‌‌తో ఎక్కువ సర్ఫేస్‌ క్లీన్‌‌ చేయొచ్చు. ఆ మురికి నీరు మట్టిలో కలిస్తే అది నేలకు మేలు చేసే బ్యాక్టీరియా పెరగడంలో సాయపడుతుంది. నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ల్యాండ్‌‌ఫిల్స్‌‌లో కుళ్లిపోయి మిథేన్ వాయువును విడుదల చేసే నిమ్మ తొక్కలను ముందే సేకరించడం వల్ల పరోక్షంగా గ్రీన్‌‌హౌస్ వాయువులను కూడా నియంత్రించినట్టే. వీటిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్‌‌, టాక్సిక్ కెమికల్స్ కూడా ఉండవు.

నమ్మకం కోసం

సాధారణంగా ప్రజలు కెమికల్ క్లీనర్లు ఇచ్చే విపరీతమైన నురగ, ఘాటైన సువాసనలకు అలవాటుపడిపోయారు. కానీ, బయో-ఎంజైమ్ క్లీనర్లకు సహజమైన నిమ్మ వాసన మాత్రమే ఉంటుంది. కెమికల్స్‌‌లా ఎక్కువగా నురగను ఇవ్వవు. అందుకే చాలామంది వీటిని కొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రజలకు వాళ్ల ప్రొడక్ట్స్‌‌ గురించి వివరించి, నురగ ఎక్కువగా వస్తేనే క్లీన్ అయినట్టు కాదు అని చెప్పి, నమ్మకాన్ని సంపాదించడానికి చాలా టైం పట్టింది. పైగా ఇద్దరూ చిన్న పిల్లల తల్లులే. ఒకవైపు పిల్లల హోమ్‌‌ స్కూలింగ్, మరోవైపు బిజినెస్‌‌ బాధ్యతలు, ప్యాకేజింగ్, ప్రొడక్షన్‌‌ని మేనేజ్‌‌ చేయాల్సి వచ్చింది. దాంతో వాళ్లకు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి కలిగినా తట్టుకుని బ్రాండ్‌‌ని నిలబెట్టారు.

15 రకాల ప్రొడక్ట్స్‌‌.. 

కొన్ని డ్రమ్ములతో టెర్రస్‌‌పైన మొదలైన ‘అర్తి’ ప్రయాణం ప్రస్తుతం హోమ్ కేర్, పర్సనల్ హైజీన్, ప్లాంట్ కేర్ విభాగాల్లో 15 కంటే ఎక్కువ రకాల ప్రొడక్ట్స్‌‌కి విస్తరించింది. వీటిలో ఫ్లోర్ క్లీనర్, ఆల్ పర్పస్ క్లీనర్, డిష్‌‌వాష్ జెల్​, లాండ్రీ డిటర్జెంట్, టాయిలెట్ క్లీనర్‌‌లతో పాటు మొక్కల సంరక్షణ, పెంపుడు జంతువుల కోసం వాడే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇళ్లకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద ఆఫీస్‌‌లు, పరిశ్రమలు, కమర్షియల్ కాంప్లెక్స్‌‌ల కోసం ప్రత్యేకంగా బల్క్ ప్రొడక్ట్ లైన్‌‌ను కూడా ప్రారంభించారు.