- ఎంపిక చేసిన 9 జిల్లాల్లో ఆరో క్లాస్ విద్యార్థులకూ
- పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సమ్మెటీవ్ అసెస్‌మెంట్ (ఎస్ఏ) పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నైన్త్ క్లాస్ స్టూడెంట్లకే ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ నిర్వహించాలని, అలాగే ఎంపిక చేసిన 9 జిల్లాల్లో ఆరో తరగతి విద్యార్థులకూ ఈ విధానాన్ని వర్తింపజేయాలని డిసైడ్ అయ్యింది. బుధవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అధ్యక్షతన టీచర్ల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
వాస్తవానికి గతంలో ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షలకు అన్ని తరగతులకు, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఒక స్కూల్ పేపర్లను ఇతర పాఠశాలల టీచర్లతో దిద్దించడంతో రవాణా, పేపర్ల బండిల్స్ మార్పిడి, బోధనకు ఆటంకం వంటి తీవ్ర పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని టీచర్ల సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో కార్యదర్శి దృష్టికి తెచ్చారు. టీచర్ల అభ్యంతరాలు, క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలను సానుకూలంగా పరిశీలించిన యోగితారాణా.. అందరిపై ఒకేసారి పనిభారం మోపకుండా ప్రస్తుతానికి పరిమితంగా, పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తాజా నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది పదో తరగతి పబ్లిక్ బోర్డు పరీక్షలు రాయనున్న దృష్ట్యా నైన్త్ క్లాస్ విద్యార్థుల పేపర్లను రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ ఇతర బడుల టీచర్లతో ఎక్స్‌టర్నల్‌గా దిద్దించనున్నారు. తద్వారా విద్యార్థుల అసలైన అభ్యసన స్థాయిలను పక్కాగా గుర్తించే వీలుంటుందని భావిస్తున్నారు. ఇక ప్రైమరీ స్థాయి దాటి హైస్కూల్‌లోకి అడుగుపెట్టిన ఆరో తరగతి విద్యార్థులకు సంబంధించి కేవలం 9 జిల్లాల్లోనే ప్రయోగాత్మకంగా ఎక్స్ టర్నల్ వాల్యువేషన్ కొనసాగుతుంది. దీనిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాగా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు.
