- డీహైడ్రేషన్‌తో సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణుల హెచ్చరిక
- నిర్దిష్ట కార్యాచరణ వెల్లడించని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గడంతోపాటు పగటి ఉష్ణోగ్రతలు(ఇప్పటికే 38 డిగ్రీలు దాటాయి) పెరుగుతున్నాయి. వచ్చేది చలికాలమే అయినప్పటికీ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే చాన్స్ఉంది. ఇక ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్ నాటికి మండిపోనున్నాయి.
అయితే, ఈ పరిణామాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ది లాన్సెట్ రిపోర్టుతోపాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావం, తాగునీటి ఎద్దడి నేపథ్యంలో వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు ఇప్పటికే అప్రమత్తమై ప్రణాళికలు అమలు చేస్తుండగా, వైద్యారోగ్య శాఖ నుంచి ఇంకా నిర్దిష్ట కార్యాచరణ వెలువడలేదు.
పేషెంట్లు అప్రమత్తంగా ఉండాలి
అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నుంచి చెమట రూపంలో నీరు అధికంగా బయటకు పోయినప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే రక్త పరిమాణం తగ్గి, డీహైడ్రేషన్ ఏర్పడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇది మూత్రపిండాలకు చేరే రక్తప్రసరణను తగ్గించి, అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ(ఏకేఐ)కి దారితీసే ప్రమాదముందని చెబుతున్నారు.
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్లు, డయాబెటిస్, బీపీ బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే క్రమంలో గుండెపై అదనపు భారం పడుతుందని, ఫలితంగా గుండె సంబంధిత సమస్యలూ వచ్చే అవకాశాలుంటాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తీవ్ర వేడి వల్ల గర్భిణుల్లో బీపీ పెరగడం, ఉమ్మనీరు తగ్గడం, ముందస్తు ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నారుల్లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు.
వృద్ధుల్లో దాహం వేసే స్పర్శ మందగించడం(హైపోడిప్సియా) వల్ల శరీరంలో లవణాల అసమతుల్యత ఏర్పడి అస్వస్థతకు లోనయ్యే చాన్స్ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వర్షాభావం కారణంగా తాగునీటి లభ్యత తగ్గి, కలుషిత నీటి వినియోగం పెరిగే అవకాశముందని, దీనివల్ల టైఫాయిడ్, కామెర్లు, గ్యాస్ట్రో ఎంటరైటిస్(వాంతులు, విరేచనాలు) వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉందని అంటున్నారు.
గతేడాది హీట్ స్ట్రోక్ సెంటర్లు ఐదే
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా హీట్‌స్ట్రోక్ సెంటర్లు ఐదే ఏర్పాటు చేశారు. ఈసారి ప్రైమరీ హెల్త్ సెంటర్లు(పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), ఏరియా హాస్పిటల్స్ స్థాయిలో మానిటర్లు, కూలర్లు లేదా ఏసీలతో కూడిన కూల్ వార్డులను అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పీహెచ్‌సీలు, సబ్-సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆర్ఎల్, నార్మల్ సెలైన్ బాటిళ్లు, వాంతులు,- విరేచనాల నివారణ మందులను సరిపడా అందుబాటులో ఉంచాలంటున్నారు.
ఆశవర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లోని గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులను గుర్తించి, జాగ్రత్తలు వివరించాలని చెబుతున్నారు. ఉపాధిహామీ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చాలంటున్నారు. ప్రజలు తరచూ నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తాగాలని, ఎండవేళల్లో అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, మూత్ర విసర్జన తగ్గడం కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు.
ఎల్‌నినో పరిణామాలు డేంజర్
ఎల్ నినో పరిణామాలు సాధారణ వేసవి ఎండల కంటే అత్యంత ప్రమాదకరమైనవని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ప్రజలు తీవ్ర అనారోగ్యం, పోషకాహార లోపం, కరువు బారిన పడ్డారని లాన్సెట్ రిపోర్టు చెబుతోంది.
1990ల నాటితో పోలిస్తే 2012-2021 మధ్యకాలంలో అధిక వేడి కారణంగా సంభవించే మరణాలు 23 శాతం పెరిగి, ఏటా సగటున 5.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం తీవ్రమైన వేడి వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో 247 బిలియన్ పని గంటల శ్రమ నష్టం వాటిల్లిందని, భారతీయులు ఏటా ఎదుర్కొనే తీవ్ర వడగాలుల రోజుల సంఖ్య దాదాపు 20కి పెరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
