పసి ఫిక్ @ 30 డిగ్రీలు..ఎల్ నినో ఎఫెక్ట్ తో తొలిసారి రికార్డు ఉష్ణోగ్రత నమోదు..భారత్ లో తీవ్రమైన ఎండలు, లోటు వర్షపాతం

పసి ఫిక్ @ 30 డిగ్రీలు..ఎల్ నినో ఎఫెక్ట్ తో తొలిసారి రికార్డు ఉష్ణోగ్రత నమోదు..భారత్ లో తీవ్రమైన ఎండలు, లోటు వర్షపాతం
  •     అసాధారణంగా పెరిగిన టెంపరేచర్
  •     వచ్చే ఏడాది వరకు ప్రభావం

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో అసాధారణరీతిలో బలపడుతోంది. దాని ప్రభావం ఇప్పటికే పలు దేశాల్లో కనిపిస్తుండగా.. తాజాగా పసిఫిక్ మహాసముద్రంపైనా ఎఫెక్ట్ పడింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి పెరిగింది. ఈ నెల 22న ఈక్వటోరియల్ పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరిందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) డేటా వెల్లడించింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఇది అసాధారణమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాతావరణ మార్పు మరింత బలపడుతూ వచ్చే ఏడాది వరకు కూడా దీని ప్రభావం కొనసాగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎల్ నినో డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది.

ఎందుకు ఆందోళనకరమంటే..

ఎల్ నినో కారణంగా సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఉపరితల గాలుల గతిని, వర్షపు మేఘాల కదలికలను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల వాతావరణం కూడా మారిపోతుందని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. డబ్ల్యూఎంఓ ప్రకారం.. ‘నినో 3.4’ అని పిలువబడే ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసం జూన్‌‌‌‌లో సాధారణం కంటే 1.6 డిగ్రీలు ఎక్కువగా ఉండగా, ఆగస్టు నాటికి అది 2.5 డిగ్రీలకు పెరిగింది. అక్టోబర్ - డిసెంబర్ మధ్య ఇది సాధారణం కంటే దాదాపు 3.7 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది 2015 నవంబర్- 2016 జనవరి మధ్య నమోదైన రికార్డు (2.6 డిగ్రీల) కంటే చాలా ఎక్కువ. అయితే, ఈ గణాంకాలు కేవలం అసలు ఉష్ణోగ్రతలు కాకుండా, దీర్ఘకాలిక సగటు కంటే సముద్రంఎంతమేర వేడెక్కిందనే విషయాన్ని సూచిస్తాయని తెలిపారు.

భారత్​పై ప్రభావం..

భారతదేశ వాతావరణాన్ని ఒక్క ఎల్ నినో మాత్రమే పూర్తిగా నిర్ణయించలేదు. ఇతర వాతావరణ పరిస్థితులు, స్థానిక అంశాలు కూడా వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, పసిఫిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల తీవ్రమైన ఎండలు, వర్షపాతంలో మార్పులు వంటి అనూహ్య వాతావరణ ముప్పు పెరిగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక ప్రకారం.. 2026లో నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే సుమారు 13% తక్కువగా నమోదైంది. రాబోయే నెలల్లో దక్షిణ ఆసియా అంతటా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని డబ్ల్యూఎంఓ యొక్క అక్టోబర్ అంచనా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో మధ్య, దక్షిణ ద్వీపకల్ప దక్షిణ ఆసియా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.