సద్దుల బతుకమ్మపై ఎల్‍ నినో ఎఫెక్ట్..బతుకమ్మల నిమజ్జనానికి ఊరురా నీటి కష్టాలు

సద్దుల బతుకమ్మపై ఎల్‍ నినో ఎఫెక్ట్..బతుకమ్మల నిమజ్జనానికి ఊరురా నీటి కష్టాలు
  • మెజారిటీ పల్లెల్లో..ఎండిన చెరువులు, కుంటలు 
  •      వరంగల్​లో ప్రత్యామ్నాయాల కోసం ఆఫీసర్ల తిప్పలు
  •      వరంగల్‍ ఆరేపల్లిలో మోటార్లతో ఎస్సారెస్పీ కెనాల్‍ నింపుతున్న గ్రామస్తులు 

వరంగల్‍, వెలుగు: సద్దుల బతుకమ్మపై ఎల్‍నినో ఎఫెక్ట్ పడుతోంది. మొన్న గణేషుడి నిమజ్జనానికి నీటికష్టాలు ఏర్పడగా ఇప్పుడు ఆడబిడ్డల పండుగకు కూడా ఆ కష్టాలు తప్పడంలేదు. ఆదివారం జరిగే సద్దుల పండుగ బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మహిళలు నీటికొలనులను వెతుకుతున్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో వానలకోసం జనాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఎంగిలిపూల బతుకమ్మ మొదలు ఎనిమిది రోజులపాటు మహిళలు ఆటపాటల అనంతరం ఆలయాలు, బొడ్రాయిల వద్దే నిమజ్జనం చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజు మాత్రం తీరొక్కపూలతో భారీ బతుకమ్మలు పేర్చి ఉత్సహంగా వేడుక చేసుకుంటారు. అనంతరం సామూహికంగా బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది ఎల్‍నినో ప్రభావంతో వానల్లేక చెరువులు, కుంటలు బోసిపోవడంతో మహిళలు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల తాత్కాలిక నీటి కొలనుల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. వరంగల్‍ నగరంలో చాలాకాలంగా బతుకమ్మ వేడుకలు అత్యంతవైభవంగా జరుగుతాయి. 

హనుమకొండలోని పద్మాక్షి ఆలయగుండం ప్రాంతానికి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలివస్తారు. వరంగల్ ఉర్సుగుట్ట చెరువు ప్రాంతం కూడా బతుకమ్మ ఆటపాటలతో సందడిగా ఉంటుంది. సద్దుల బతుకమ్మలతో ఈ ప్రాంతాలు పూలవనంగా మారతాయి. ఈసారి ఎల్‍నినో ప్రభావంతో ట్రైసిటీలోని చెరువులు, కుంటలు అడుగంటాయి. 15 నుంచి 20 ఫీట్ల నీటితో కళకళలాడే పద్మాక్షి గుండం, ఉర్సు చెరువులు ఇప్పుడు నీరులేక వ్యర్థాలు, బురదతో దర్శనమిస్తున్నాయి. దీంతో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ వెంకన్నతో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు ఈ చెరువులను శుభ్రపరిచేలా చర్యల్లో నిమగ్నమయ్యారు.

బతుకమ్మ కోసం కదిలిన ‘ఆరేపల్లి’
ఎల్ నినో ఎఫెక్ట్​ను ఎదుర్కొని బతుకమ్మ సంబురాన్ని ఎప్పటిలాగా నిర్వహించేందుకు వరంగల్‍ గ్రేటర్ లో విలీన గ్రామమైన ఆరేపల్లి ముందడుగు వేసింది. ఏటా పైడిపల్లి, దేశాయిపేటతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు ఆరేపల్లి కెనాల్ వద్ద నిమజ్జనం చేస్తారు. ఈసారి అక్కడ నీటిచుక్క లేకపోవడంతో ఎస్సారెస్పీ సబ్‍ కెనాల్​లో దాదాపు కిలోమీటర్ పొడవున వ్యర్థాలను తొలగించారు. ట్రాక్టర్‍తో మట్టి తీసుకొచ్చి కెనాల్​లో రెండువైపులా అడ్డుకట్ట వేశారు. ఆపై మూడు మోటార్ల ద్వారా వ్యవసాయ బావుల నుంచి పైపులు వేసి కెనాల్‍ ను నీటిని నింపుతున్నారు. గురువారం రాత్రి పనులు మొదలుపెట్టగా శుక్రవారం నాటికి నీరు కొంతమేర చేరింది. శని, ఆదివారాల్లో నిమజ్జనాలకు సరిపడేలా నీటిని నింపేందుకు ముమ్మరంగా పని చేస్తున్నారు. 

బతుకమ్మ ఆట ఆగొద్దనే.. 
చాలా ఏండ్లుగా చుట్టు పక్కల గ్రామాల మహిళలు ఆరేపల్లి కెనాల్‍ వద్ద బతుకమ్మ ఆడేందుకు వస్తున్నారు. ఈసారి నిమజ్జనం చేయడానికి కెనాల్​లో నీరులేదు. మా మిత్రబృందంతో పాటు గ్రామస్తులమంతా కలిసి కెనాల్‍ శుభ్రం చేసి నీళ్లు నింపుతున్నాం. అందుబాటులో ఉన్న మూడు మోటార్లను వాడుతున్నాం. ఆదివారం నిమజ్జన సమయానికి కావాల్సిన నీరు నింపుతాం. 
-సుంకరి ప్రశాంత్‍, సామాజిక కార్యకర్త