ఆసిఫాబాద్: వృద్ధుడి దారుణ హత్య..మెడపై గొడ్డలి వేటుతో తల, మొండెం వేరు

ఆసిఫాబాద్: వృద్ధుడి దారుణ హత్య..మెడపై గొడ్డలి వేటుతో తల, మొండెం వేరు

ఆసిఫాబాద్, వెలుగు: రైల్వే స్టేషన్ లో భార్య, కూతురును కుర్చోబెట్టి టీ తాగి వస్తానంటూ చెప్పి వెళ్లిన వృద్ధుడు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా రెబ్బెన(ఆసిఫాబాద్ రోడ్) రైల్వే స్టేషన్  సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్య కలకలం రేపింది. రెబ్బెన సీఐ సంజయ్  తెలిపిన వివరాల ప్రకారం.. పర్స నంబాల గ్రామానికి చెందిన మసాడే సోమయ్య(65) గురువారం గ్రామంలోని చిన్న కూతురు సుజాత ఇంటికి భార్యతో కలిసి వెళ్లాడు. హైదరాబాద్ లో ఉండే పెద్ద కూతురు లక్ష్మి కూడా అక్కడికి రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. 

శుక్రవారం ఉదయం లక్ష్మిని రైలులో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు పంపేందుకు సోమయ్య, భార్య, ఇద్దరు కూతుళ్లతో ఆసిఫాబాద్  రోడ్  రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ఈక్రమంలో టీ తాగి వస్తా అని చెప్పి సోమయ్య బస్టాండ్  వైపు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై బలంగా దాడి చేయడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య కరుణాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఆసిఫాబాద్  డీఎస్పీ అశోక్  పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.