ఎల్నినో ఎఫెక్ట్: నెలకు ఒక్క యూనిట్ ఆదా చెయ్ కరెంట్ బాధ తగ్గించెయ్..పీక్అవర్స్లో గ్రిడ్లపై తీవ్ర భారం

ఎల్నినో ఎఫెక్ట్: నెలకు ఒక్క యూనిట్ ఆదా చెయ్ కరెంట్ బాధ తగ్గించెయ్..పీక్అవర్స్లో గ్రిడ్లపై తీవ్ర భారం
  • ఎల్​నినోతో భారీగా పెరిగిన వినియోగం 
  • హైదరాబాద్‌లో 63 లక్షలకు పైగా కనెక్షన్లు.. 
  • ఫ్యామిలీ ఒక యూనిట్​ తగ్గిస్తే  నెలకు 63 లక్షల యూనిట్లు
  • మాసానికి రూ.4.50 కోట్లు.. 
  •  ఏడాదికి రూ.50 కోట్లకు పైగా ఆదా 

ఎల్​నినో ఎఫెక్ట్​మామూలుగా లేదు..ప్రతి ఏడాది అక్టోబర్​ఎండింగ్​లో చలిలో వణుకుతూ ఉండాల్సిన మనం చెమటలు కక్కుతూ ఫ్యాన్లు, ఏసీల కింద కాలం వెళ్లదీయాల్సి వస్తున్నది. దీంతో కరెంట్​వినియోగం పెరిగి పవర్‌ గ్రిడ్లపై తీవ్ర భారం పడుతున్నది. దీన్ని నివారించాలంటే కరెంట్​ను ఆదా చేయడమే ప్రధాన మార్గమని నిపుణులు చెప్తున్నారు. 

ఒక్క కుటుంబం నెలకు కనీసం ఒక్క యూనిట్​ఆదా చేసినా గ్రేటర్​లోని 63 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లకు కలిపి 63 లక్షల యూనిట్లు మిగులుతాయని, దీనివల్ల డిస్కమ్​లు ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం తప్పుతుందంటున్నారు. గ్రిడ్, సబ్‌స్టేషన్లపై లోడ్ తగ్గి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, ఫ్యూజ్‌లు పోవడం వంటి సమస్యలు ఉండవని, అంతరాయం లేని విద్యుత్ అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు.

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఎండల తీవ్రతతో వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో పీక్ అవర్స్‌లో డిమాండ్‌ను తట్టుకోవడం విద్యుత్ శాఖకు పెద్ద సవాల్‌గా మారుతున్నది. పవర్‌ గ్రిడ్లపై తీవ్ర భారం పడుతున్నది. 

గతేడాది అక్టోబర్ లో పీక్ అవర్స్​లో 3,552 మెగావాట్ల విద్యుత్​ను వినియోగించగా, ఈ సారి అక్టోబర్ 9న గరిష్టంగా 5 వేల మెగావాట్లు నమోదైంది. అలాగే, ఈ నెల15న 4,220, 20న పండుగకు అందరూ ఊరెళ్లడంతో 3,288 మెగావాట్లు నమోదైంది.

 రెండు మూడు రోజుల్లో మళ్లీ విద్యుత్ వినియోగం పెరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే వేసవి నాటికి సిటీ అవసరాలకు కావాల్సిన కరెంట్​ను అందించడం కష్టతరమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే, కరెంట్ పొదుపుపై ప్రభుత్వంతో పాటు విద్యుత్​శాఖ ప్రచారం నిర్వహిస్తున్నది.

 ప్రైవేట్​నుంచి తాము యూనిట్‌కు రూ.7 వరకు పెట్టాల్సి వస్తున్నదని, రేపటి రోజున ఈ ధరకు కూడా దొరక్కపోతే విద్యుత్ కోతలు తప్పవని హెచ్చరిస్తున్నది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నగర ప్రజలు విద్యుత్​పొదుపు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

పొదుపు ఇలా చేయండి  

చాలా మంది ఫ్యాన్స్, బల్బులు ఆన్ చేసి తర్వాత అవసరం లేకపోయినా అలాగే వదిలేస్తారు. హాల్ లో ఉంటే బెడ్​రూంలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. వాష్​రూం వెళ్లి వచ్చాక లైట్​ఆఫ్​ చేయడం మర్చిపోతారు. హాల్​లో టీవీ రన్​అవుతూ ఉంటుంది..ఫ్యాన్​ తిరుగుతూ ఉంటుంది..వెళ్లి బెడ్​రూంలోనో, కిచెన్​లోనో ఉంటారు. 

ఫోన్ ​ఛార్జర్ ​తీసేసి స్విచ్​ఆఫ్​చేయరు. ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కరెంట్​వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది. అందుకే, కొంచం శ్రద్ధ పెడితే మన కరెంట్​ బిల్లును తగ్గించుకోవడంతో పాటు విద్యుత్​ శాఖకు కొంతైనా మేలు చేసినవారవుతారు. కాబట్టి రూంలో ఫ్యాన్లు అవసరం లేకపోయినా తిరుగుతున్నా, పగలు వెలుగు ఉన్నా లైట్లు వెలుగుతుంటే  ఆఫ్​ చేయండి. 

ఏసీని 25 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్ లో మాత్రమే పెట్టుకోండి. చాలామంది రాత్రి పడుకునేముందు వైఫై ఆన్​లోనే ఉంచి పడుకుంటారు. కానీ, ఆఫ్ చేస్తే కొంతవరకైనా కరెంట్​ను ఆదాచేసినవారవుతారు. ఎక్కువ వాట్స్​ ఉన్న బల్బులను మార్చి ఎల్​ఈడీ బల్బులను వాడడం బెటర్​. ఇలాంటి చిన్న చిన్న పనులతో నెలకు ఒక్క యూనిట్​కాదు..ఏకంగా 30 నుంచి 50 యూనిట్ల వరకు ఆదా చేయవచ్చని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. 

ఎల్ నినో తో రాబోయే రోజుల్లో మరింత కరెంట్ డిమాండ్​ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే పొదుపు మంత్రం పాటించాలని సలహా ఇస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు స్లాబ్ రేటు మారి, భారీగా వచ్చే అదనపు బిల్లుల భారం తప్పుతుందంటున్నారు. 

ఇలా చేయండి ఆదా...

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 63 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో ప్రతి వినియోగదారుడు నెలకు కేవలం ఒక్క యూనిట్ చొప్పున ఆదా చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు. 

ఒక్కో వినియోగదారుడు నెలకు ఒక్క యూనిట్ తగ్గిస్తే మొత్తం కనెక్షన్ల నుంచి నెలకు 63 లక్షల యూనిట్ల కరెంట్ ఆదా అవుతుందని, దీనివల్ల కొనుగోలు ధరకు (యూనిట్‌కు రూ. 7 చొప్పున) అనుగుణంగా నెలకు దాదాపు రూ.4.50 కోట్లు ఆదా అవుతాయంటున్నారు. ఈ లెక్కన రోజుకు 2 లక్షల 10వేల యూనిట్లు ఆదా అయి రూ.14.70 లక్షలు మిగులుతాయంటున్నారు. వినియోగదారులు ఇలా చేసే పొదుపు ద్వారా ఏడాదికి దాదాపు రూ.50 కోట్లకు పైగా ప్రజాధనం, విద్యుత్ ఛార్జీలు ఆదా అవుతాయని చెప్తున్నారు. 

ఫ్యాన్, బల్బ్ కు కరెంట్​ఎంత.. ? 

ఉదాహరణకు ఒక సాధారణ సీలింగ్ ఫ్యాన్ 17 గంటలు నిరంతరం నడిస్తే సుమారు 1.3 నుంచి 1.5 యూనిట్ల వరకు కరెంట్ ఖర్చవుతుంది. సాధారణ ఎల్ఈడీ బల్బ్ సుమారు 10- నుంచి 12 గంటలు వెలిగితే ఒక యూనిట్ కాలుతుంది.  

ప్రస్తుతం 1 టన్ను లేదా 1.5 టన్ను ఏసీ గంటకు 1 నుంచి 1.5 యూనిట్ల వరకు తీసుకుంటుంది. ఒక ఎయిర్ కూలర్ గంటకు 0.2 నుంచి 0.3 యూనిట్లు, వాషింగ్ మెషీన్ ఒక్కసారి వాషింగ్ సైకిల్‌కు సుమారు 0.5 నుంచి 1 యూనిట్ వరకు ఖర్చవుతుంది. ఇక ఇండ్లల్లో 24 గంటలూ పనిచేసే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ రోజుకు సుమారు 1.5 నుంచి 2.5 యూనిట్ల వరకు కరెంట్‌ను తీసుకుంటాయి.