ఓట్ చోరీలో మోడీ, అమిత్ షాలదే కీ రోల్.. ఈ విషయం దేశమంతటికీ తెలుసు: రాహుల్

ఓట్ చోరీలో మోడీ, అమిత్ షాలదే కీ రోల్.. ఈ విషయం దేశమంతటికీ తెలుసు: రాహుల్

పనాజీ: ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్‎లపై  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ఆదివారం (అక్టోబర్ 18) సౌత్ గోవాలోని మడ్‌గావ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ గోయ్  రఖోన్ యాత్ర ముగింపు సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీకి పాల్పడుతున్నాడని.. ప్రధాని మోడీ, అమిత్ షా అతని వెనక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం దేశమంతటికీ తెలుసని పేర్కొన్నారు. 

బీజేపీ నేతలు తనపై దాదాపు 45 కంటే ఎక్కువ పరువు నష్టం కేసులు పెట్టారు. కానీ ఓట్ చోరీ ఆరోపణలపై మాత్రం తనపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే.. ఒకవేళ వారు ఓట్ చోరీ గురించి కేసు పెడితే అది పూర్తిస్థాయి న్యాయపోరాటంగా మారుతుంది. అప్పడు తాము కూడా ఇందులో చిక్కుకుంటామని వారు భయపడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

ఓట్లను దొంగిలించడం ద్వారా దేశ రాజ్యాంగంపై, పౌరుల హక్కులపై ఎన్నికల సంఘం, బీజేపీ దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఈ ఓట్ల దొంగతనం వ్యవహారంలో భాగస్వాములైన వారందరినీ బాధ్యులను చేస్తామని, భవిష్యత్తులో వారికి శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు.