జనం సొమ్ముతో పాండురంగ చెరువు నుంచి కెనాల్ మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి పైప్ లైన్

జనం సొమ్ముతో  పాండురంగ చెరువు నుంచి కెనాల్ మీదుగా కేసీఆర్  ఫామ్ హౌస్ లోకి పైప్ లైన్


ఎల్​నినో వల్ల ఈసారి వానల్లేక అటు దేశం, ఇటు తెలంగాణల ఎటుచూస్తే అటు కరువే దరువేస్తున్నది. చూస్తుండంగనే చెరువులు, డ్యామ్​లు, రిజర్వాయర్లు, బోర్లళ్ల నీళ్లు ఇంకిపోతున్నయ్​. చాలాచోట్ల నీటి జాడలేక చేతికచ్చిన పంటలు ఎండిఎరగప్పయితన్నయ్​. వచ్చే ఏడెనిమిది నెలలు జనానికి గుక్కెడు తాగునీరు ఎట్లా ఇవ్వాల్నో తెల్వక సర్కారు తలపట్టుకుంటున్నది. ఇట్లాంటి టైంల ఓ ప్రాంతం మాత్రం కళకళలాడే చెరువు, నిండుకుండలాంటి బాయి, గలగలపారే కాల్వలు, పైపులైన్లతో వందల ఎకరాల్లో పచ్చదనంతో అలరారుతోంది. అది సహజంగా జరిగితే అద్భుతమే. కానీ పదేండ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని , వందల కోట్ల జనం సొమ్ముతో ఒక్క వ్యక్తి తన సొంతానికి చేసుకున్న ఏర్పాటు!! అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్. 


పాండురంగ చెరువు నుంచి నీళ్లు మళ్లించడానికి వ్యవసాయ శాఖ నుంచి భారీగా నిధులను ఖర్చుపెట్టారు. దీనికి నిదర్శనంగా 2016, 2017లో ఇచ్చిన మూడు జీవోలున్నాయి. 2016 జనవరి 5న ఇచ్చిన జీవో 2 ప్రకారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మోడల్ గ్రామాలుగా గుర్తించి వీటిలో 3వేల ఎకరాల్లో బిందుసేద్యం కోసం ఏర్పాట్లు చేయాలి. ఇందుకు100 శాతం సబ్సిడీ ఇస్తూ మొత్తం ఖర్చు సర్కారే పెడుతుందని చెప్పారు. మొదట్లో 42.54 కోట్లతో పాలన అనుమతి ఇచ్చారు. తర్వాత 2016 ఏప్రిల్ 7న జీవో 149 జారీ చేశారు.

 దీని ప్రకారం ఈ ప్రాజెక్టు అమలుకు నెటాఫిమ్ అనే ప్రైవేటు కంపెనీతో ఎంవోయూ చేసుకున్నారు. ఖర్చు అంచనాను రూ.49.89 కోట్లకు పెంచి ఆమోదించినట్లు చెప్పారు. ఇందులో 25 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించారు. మూడునెలల్లోనే అంచనాలు రూ.7.35 కోట్లు పెంచారు. దీనికి కారణాలు చెప్పలేదు. తర్వాత 2017 జనవరి 30న సవరణ జీవో 49 ఇచ్చారు. కొన్ని నిబంధనల్లో మార్పులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్శిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు నేతృత్వంలోని కమిటీ ధ్రువీకరిస్తే చెల్లింపులు చేస్తామని చెప్పారు. ముందు జీవోలో ఉచితం అని ఉన్న నెటాఫిమ్ సేవలకు చెల్లింపుల ఒప్పందం చేసుకోవాలని సవరణ జీవోలో ఉంది. ఇంత ఖర్చుపెట్టే ప్రాజెక్టుకు టెండర్ ప్రస్తావన లేకుండా నేరుగా నెటాఫిమ్ కు అప్పగిస్తూ జీవో ఇచ్చారు. 

‘ఎకరాకు కోటి’ ఉపాయం ఇదేనా
 
తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని అభివర్ణించుకున్నారు. అంత పెద్ద నాయకుడు చెబితే నిజమేనని చాలామంది నమ్మారు. కానీ ఎకరానికి కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలన్నది మాత్రం ఇన్నేళ్లలో ఎవరికీ అంతుబట్టని రహస్యంగా  మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కోటి సంపాదన సాధ్యమే కావచ్చని అనిపిస్తోంది. వేలకోట్ల జనం సొమ్ముతో రిజర్వాయర్, భారీ కెనాల్​, చెరువులు, నీళ్లు నేరుగా పొలానికి తెచ్చిపోసేలా ఏర్పాట్లు ఉంటే పంట ఆదాయం మొత్తం లాభమే కదా! ఉచితంగా సలహాలిచ్చే వ్యవసాయ నిపుణులు కూడా ఉంటే రాబడి కోట్లలో ఉండే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ వ్యవసాయంలో లాభాల అసలు రహస్యం బహుశా ఇదేనేమోననే చర్చ జరుగుతోంది.