ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల భూములకు సంబంధించిన అడంగల్ పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను అధికారులు శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌కు తరలించారు. కలెక్టర్ సూచన మేరకు మర్కుక్ తహసీల్దార్ సరిత ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది రికార్డులను మూటలుగా కట్టి కారులో తీసుకెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది.
దీంతో మరో 45 ఎకరాల భూమి గల్లంతైనట్లు గుర్తించారు. ఈ భూమి ఎటు పోయిందో గుర్తించేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల అడంగల్ పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
గ్రామ హద్దుల నిర్ధారణకు నోటీసులు
ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల నిర్ధారణ కోసం రెవెన్యూ అధికారులు శుక్రవారం సాధారణ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బానోతు సేవియా నాయక్, వంశీ, సర్వే, రెవెన్యూ అధికారులు మర్కుక్ తహసీల్దార్ సరితతో సమావేశమయ్యారు. అనంతరం మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంతోపాటు ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్ల వద్ద నోటీసులు ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి భూ రీ సర్వేలో భాగంగా శనివారం నుంచి రెండు గ్రామాల్లో సరిహద్దుల సర్వే నిర్వహించనున్నట్లు డివిజనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బానోతు సేవియా నాయక్ తెలిపారు. సర్వేకు ఆయా గ్రామాల రైతులు సహకరించాలని కోరారు.
