- యూరప్ నుంచి వెలువడే కాలుష్యం భారత్ కంటే చాలా రెట్లు ఎక్కువ
- మీరే బొగ్గును విపరీతంగా వాడి ఓజోన్ పొరను దెబ్బతీశారు
- జర్మనీ సదస్సులో యూరప్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపాటు
బెర్లిన్: ప్రపంచంలో వాతావరణ కాలుష్యం పెరగడానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందడం కోసం ఆయా దేశాలు బొగ్గును విపరీతంగా ఉపయోగించాయని..దాంతో ఓజోన్ పొర దెబ్బతిన్నదని వివరించారు.
శుక్రవారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో 'బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ 2026' సదస్సు జరిగింది. ఇందులో ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో గోయల్ మాట్లాడుతూ.."ప్రస్తుత వాతావరణ సంక్షోభానికి కారణం ఎవరు? ఓజోన్ పొర దెబ్బతినేంత కార్బన్‌ను వాతావరణంలోకి పంపింది ఎవరు?" అని ప్రశ్నించారు.
ఈ సంక్షోభానికి మనమందరం బాధ్యులమేనని ప్యానెల్‌లో ఓ సభ్యుడు బదులివ్వగా..దాన్ని గోయల్ తీవ్రంగా ఖండించారు. "కాదు..ఈ సమస్య మీ(యూరప్ కంట్రీస్) వల్లే తలెత్తింది. మీరు త్వరగా ఆర్థికంగా ఎదగడానికి, చౌకగా ఇంధనాన్ని పొందడానికి బొగ్గును ఉపయోగించారు" అంటూ గోయల్ మండిపడ్డారు.
భారత్ నుంచి కార్బన్ ఉద్గారాలు 3 శాతంలోపే
ప్రపంచంలోని మొత్తం జనాభాలో భారతదేశం17 శాతం జనాభాను కలిగి ఉన్నదని..అయినా భారత్ నుంచి కేవలం 3 శాతం కంటే తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయని గోయల్ చెప్పారు. కానీ, యూరప్ జనాభా ప్రపంచంలో కేవలం 3 శాతం మాత్రమే ఉన్నప్పటికీ కార్బన్ ఉద్గారాల వాటా ఎక్కువగా ఉందన్నారు.భారత ఉద్గారాల వాటా యూరప్ దేశాలతో పోలిస్తే 10 నుంచి 15 శాతం కూడా ఉండదని వివరించారు. భారతీయులు పర్యావరణం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్నారని గోయల్ పేర్కొన్నారు.
ఇబ్బందులను మీరే కొనితెచ్చుకున్నారు
గతంలో స్వార్థం కోసం చేసిన తప్పుల వల్లే యూరప్ దేశాలు ఇప్పుడు ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నాయని గోయల్ విమర్శించారు. ఆ దేశాలు తమపై తాము 'కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం)' నిబంధనలను విధించుకుంటున్నాయని..ఉక్కు దిగుమతులపై ఏకంగా 50 శాతం దిగుమతి సుంకం అమలు చేస్తున్నారని వివరించారు.
ప్యారిస్ వాతావరణ ఒప్పందం జరిగి దాదాపు 11 ఏండ్లు గడుస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలు మాటిచ్చిన ఆర్థికసాయంలో (రూ. 8.4 లక్షల కోట్లలో) ఒక్క రూపాయి కూడా భారత్ కు ఇవ్వలేదని పీయూష్ గోయల్ మండిపడ్డారు.అయినా గ్రీన్ ఎనర్జీ వాడకంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని గోయల్ పేర్కొన్నారు.
