కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ లీడ్ రోల్‌లో హర్ష వర్ధన్ కడియాల రూపొందిస్తున్న చిత్రం ‘కూర్మ అవతార్’. నరేంద్ర కొండ సమర్పణలో పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
రీసెంట్‌గా వచ్చిన ‘ఇరుముడి’ తరహాలో ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని చూడను. కథ నచ్చితే సినిమా చేస్తాను. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు.
ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో తాము కనిపిస్తామని రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్ అన్నారు. తన తొలి సినిమానే శివ రాజ్‌కుమార్ లాంటి సీనియర్స్‌ను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు హర్ష వర్ధన్ చెప్పాడు. విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాతలు అన్నారు.
