కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొల్లి

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొల్లి

నిర్మల్, వెలుగు :  మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరతారన్న ప్రచారం ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడంతో ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మూడ్రోజులుగా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సన్నిహితుడు, సిర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరేందుకు సిద్ధమై ఇప్పటికే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. దీని వెనుక కూడా మాజీ మంత్రి చొరవ ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి పార్టీలోని చాలా మంది ముఖ్యనాయకులతో సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో పలువురితో ఆయన మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఇంద్రకరణ్​రాకను జిల్లా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అవినీతి ఆరోపణలున్న ఆయనను చేర్చుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దుష్ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సోమవారం అన్ని మండలాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ కమిటీల్లో ప్రత్యేకంగా తీర్మానాలు చేసి హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపుతున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి తమ అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి ద్వారా ఈ విషయంపై హైకమాండ్​మీద ఒత్తిడి తేవాలని మండల, జిల్లా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు నిర్ణయించారు. నిర్మల్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు సుదర్శన్, మామడ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ.రమణారెడ్డి, సారంగాపూర్ మండల నాయకుడు బొల్లోజు నరసయ్య తదితరులు హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరలివెళ్లారు.

మధ్యవర్తిత్వం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జు

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చేరిక వ్యవహారాన్ని అప్పగించినట్టు చెప్తున్నారు. బొజ్జు పది రోజులుగా ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ముథోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో మాట్లాడుతున్నట్టు సమాచారం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినప్పుడు ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో చర్చలు జరిపారు.