సింక్‌లో ఏం వేయకూడదు? పొరపాటున కూడా సింక్‌లో వేయకూడనివి ఏంటంటే..

సింక్‌లో ఏం వేయకూడదు? పొరపాటున కూడా సింక్‌లో వేయకూడనివి ఏంటంటే..

వంటగది సింక్ ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంది. ఉదయం మిగిలిపోయిన టీ నుంచి రాత్రి భోజనం గిన్నెల వరకు, రోజంతా లెక్కలేనంత నీళ్లు, వ్యర్థాలు సింక్ నుంచే వెళ్తాయి. మనలో చాలా మంది మిగిలిపోయిన నూనె, టీ ఆకులు, పిండి, బియ్యం లేదా చిన్న చిన్న ఆహారపు ముక్కలను కూడా సింక్‌లో పడేస్తుంటారు. అయితే.. ఆ సమయంలో.. నీటితో పాటు అన్నీ కొట్టుకుపోయినట్లు అనిపిస్తుంది.

కానీ నీటితో కొట్టుకుపోయిన వ్యర్థాలు కొన్ని పైపుల నుంచి బయటకు రావు. అవి పైపులలో ఇరుక్కుపోతాయి. ఈ పేరుకుపోవడం క్రమంగా దుర్వాసన, సింక్‌లు మూసుకుపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. అందువల్ల, వంటగది సింక్ లో ఏ వ్యర్థాలను వేయకూడదనే విషయాలను తెలుసుకుందాం.. 

పాత్రలను శుభ్రంగా కడగకుండా నేరుగా సింక్‌లో కడగడం వల్ల, ప్లేట్లు, ప్యాన్‌లు, కుండలపై మిగిలిపోయిన ఆహారం, నూనె, నెయ్యి, మసాలాలు పైపులలో ఇరుక్కుపోతాయి. పిండిని కలిపిన తర్వాత మిగిలిపోయిన పిండిని లేదా బియ్యం నీటిని సింక్‌లో పోయడం వల్ల పైపుల లోపల మలినాలు పేరుకుపోవచ్చు. పనికిరాని నూనె, నెయ్యిని సింక్లో పొరపాటున కూడా పోయకండి. ఒక సీసాలో లేదా పాత్రలో పోసి చెత్తలో పారవేయండి. 

టీ ఆకులను కంపోస్టులో వేయండి లేదా తడి వ్యర్థాలతో పాటు పారవేయండి. కాఫీ పొడిని కంపోస్ట్ లేదా తడి వ్యర్థాలలో వేయండి. బియ్యాన్ని తడి వ్యర్థాలతో పాటు వేయండి, దానిని సింక్‌లో ఫ్లష్ చేయవద్దు. పిండిని చెత్తబుట్టలో పడేయండి. నీటితో ఫ్లష్ చేయవద్దు. పాస్తా, నూడుల్స్‌ను తడి వ్యర్థాలలో పారవేయండి. గుడ్డు పెంకులను కంపోస్టులో లేదా చెత్తలో పారవేయండి. సింక్ లో పొరపాటున కూడా వేయొద్దు. పండ్లు, కూరగాయల తొక్కలను సింక్లో వేయకండి. స్టిక్కర్లు, లేబుల్‌లను పొడి వ్యర్థాలతో పాటు పారవేయండి.

మరో ముఖ్యమైన విషయం.. టాయిలెట్ సీట్ల కంటే కిచెన్ స్క్రబ్‌లలో ఎక్కువ క్రిములు ఉంటాయనే విషయం తెలిస్తే ఆశ్చర్యం అనిపించక మానదు. స్క్రబర్స్ తడిగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అందువల్ల.. స్క్రబర్లను ఎప్పుడూ పొడిగా ఉంచండి. ప్రతి మూడు వారాలకు వాటిని మార్చండి.