‘108’లో కంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్... దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

‘108’లో కంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్... దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
  • ఎల్వీ ప్రసాద్, 108 ఈఎంఆర్ఐ, సరోజినీ దేవి ఆస్పత్రుల జాయింట్ ప్రోగ్రామ్​
  • సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.. అంబులెన్స్‌‌ల్లో ఐ ఎమర్జెన్సీ కిట్లు

హైదరాబాద్, వెలుగు: కంటి గాయాలతో శాశ్వత అంధత్వం బారిన పడకుండా బాధితులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు 108 అంబులెన్స్‌‌ల్లో ప్రత్యేక సేవలు ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌‌లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టును గురువారం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌‌స్టిట్యూట్ (ఎల్వీపీఈఐ), ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (108), సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా ప్రారంభించాయి. దీపావళి వేళ పటాకుల ప్రమాదాల ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈఎంఆర్ఐ డైరెక్టర్ కే కృష్ణంరాజు, ఎల్వీపీఈఐ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు సేవలను ప్రారంభించారు.

ఆలస్యం వల్ల చూపుపోయే ముప్పు

కంటి గాయాల బాధితులు స్పెషలిస్ట్ ఆస్పత్రులకు చేరడంలో ఆలస్యం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం పెరుగుతోందని వైద్యులు తెలిపారు. యువత, పని చేసే వయసులో ఉన్నవారిలో కంటి గాయాలు దృష్టి లోపానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతున్న నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్లు, ఈఎంఎస్ ట్రైనర్లకు గాయాలను గుర్తించడం, తీవ్రతను అంచనా వేయడం, అత్యవసర కాల్స్‌‌ను నిర్వహించడంపై శిక్షణ ఇచ్చారు. 

అంబులెన్స్‌‌ల్లో ప్రత్యేక ఐ ఎమర్జెన్సీ కిట్లు ఏర్పాటు చేసి, ఆస్పత్రికి చేరేలోపే ప్రాథమిక చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం బాధితులను సరోజినీ దేవి లేదా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రులకు త్వరగా తరలించేలా రిఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవల సమన్వయ బాధ్యతలను సరోజినీ దేవి ఆస్పత్రి నిర్వహిస్తోంది. 

కార్యక్రమంలో ఎల్వీపీఈఐ ప్రతినిధులు డాక్టర్లు ప్రవీణ్ కే వడ్డవల్లి, రాజీవ్ రెడ్డి పప్పూరు, రామం ఆత్మకూరి; ఈఎంఆర్ఐ సీనియర్ ప్రెసిడెంట్ సుబోధ్ సత్యవాది, డైరెక్టర్ డాక్టర్ జీవీ రమణారావు, కన్సల్టెంట్ డాక్టర్ రాజ నర్సింగ్ రావు; సరోజినీ దేవి ఆస్పత్రి హెచ్‌‌వోడీ డాక్టర్ శాంతా మరిసా, డాక్టర్లు విజయలక్ష్మి, పూర్ణిమ తాండ్ర తదితరులు పాల్గొన్నారు.