ఎన్నికలతోనే ప్రభుత్వ మార్పు సాధ్యం.. ఉద్ధవ్ థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్

ఎన్నికలతోనే ప్రభుత్వ మార్పు సాధ్యం.. ఉద్ధవ్ థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్: ప్రభుత్వ మార్పు ఎన్నికలతోనే సాధ్యమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి అడ్డదారుల్లో అధికారాన్ని మార్చాలని చూస్తే కుదరదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో ‘ప్రభుత్వ మార్పు’ వ్యాఖ్యలకు ఉద్ధవ్ థాక్రే మద్దతు తెలపడంపై ఆయన మండిపడ్డారు. సొంత పార్టీని కాపాడుకోలేని ఉద్ధవ్.. ప్రభుత్వ మార్పు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. 

హిందుత్వం, బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను ఉద్ధవ్ వదిలేశారని విమర్శించారు. 2022లో శివసేనలో చీలికను ప్రస్తావిస్తూ.. బాలాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నవారే పార్టీ నుంచి బయటకు వచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల మద్దతుతో మెజార్టీ సాధించాలని ఫడ్నవీస్ సూచించారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో భారత్‌‌‌‌‌‌‌‌లోనూ రాజకీయ అస్థిరత సృష్టించాలనుకునే వారి ఆటలు సాగవని హెచ్చరించారు.