సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ అయితే చాలు.. కొందరు ఆకతాయిలు చేసే పనులు సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. సరదా పేరుతో చేసే పనులు ఎదుటివారిని ఎంత ఇబ్బందులకు గురిచేస్తాయో చెప్పడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి ఎదురైన పరిస్థితి తరహాలోనే ఇప్పుడు తెలంగాణకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజు కూడా ఫేక్ క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆర్డర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన నాగరాజు పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఆర్డర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఫ్రిజ్ లు, గృహోపకరణాలతో పాటు బిర్యానీలు కూడా ఆయన అడ్రస్‌కు పంపించడంతో ఇంటి ముందు డెలివరీ బాయ్స్ క్యూ కట్టారు.. ఆర్డర్లు తాను పెట్టకపోయినా, వస్తువులు తీసుకోవాలంటూ డెలివరీ సిబ్బంది రావడంతో నాగరాజుకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురైంది. లక్షల రూపాయల విలువైన వస్తువులకు డబ్బులు చెల్లించడం సాధ్యం కాక, ఇంట్లోకి వెళ్లలేక, బయటకు వెళ్లలేక ఆయన ఇబ్బందులు పడ్డారు.
ఈ వ్యవహారంపై స్పందించిన నాగరాజు.. తన పేరుతో ఇలాంటి ఫేక్ ఆర్డర్లు పెట్టవద్దంటూ చేతులెత్తి వేడుకున్నారు. సరదా కోసం చేసే ఇలాంటి పనులు ఇతరులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించడమే కాకుండా, డెలివరీ సిబ్బంది సమయం, శ్రమను కూడా వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జొమాటో , ప్లిప్ కార్ట్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులోని మధురైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీపావళి సందర్భంగా స్వీట్లు పంపాలని కోరుతూ తన వివరాలను పంచుకున్న ఆయనకు, గుర్తుతెలియని వ్యక్తులు భారీగా COD ఆర్డర్లు పెట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకి ఇళ్లుకూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాగే నాగరాజుకు కూడా ఫేక్ క్యాష్ ఆన్ డెలివరీ రావడంతో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఘటనలు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయడం ఎంతటి సమస్యలకు దారితీస్తుందో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా COD విధానంలో ఆర్డర్ పెట్టినప్పుడు వస్తువు అందుకున్న తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులు ఆర్డర్ చేయని వస్తువులను స్వీకరించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో ఆర్డర్‌ను నిరాకరించి, సంబంధిత ప్లాట్‌ఫామ్‌కు ఫిర్యాదు చేయవచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఫేక్ ఆర్డర్లులతో ఇతరులను ఇబ్బంది పెట్టంట సరికాదని నాగరాజుకు మద్దతుగా నిలుస్తున్నారు.
