లక్షల్లో నకిలీ వాట్సాప్ యాప్ డౌన్ లోడ్స్.. గూగుల్ ప్లే నుంచే ఇదంతా..!

లక్షల్లో నకిలీ వాట్సాప్ యాప్ డౌన్ లోడ్స్.. గూగుల్ ప్లే నుంచే ఇదంతా..!

ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారా..? అయితే, మీ ఫోన్‎లో ఉన్నది నకిలీ వాట్సాప్ యాప్ కూడా కావచ్చు. ఎందుకంటే.. ప్లే స్టోర్‎లో వాట్సాప్‏ను పోలిన నకిలీ వాట్సాప్ యాప్ తీవ్ర కలకలం రేపుతోంది. అచ్చం వాట్సాప్ మాదిరిగానే పేరు, లోగోతో ప్లే స్టోర్‎లో నకిలీ యాప్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా యూజర్లు ఈ ఫేక్ యాప్‎ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు సమాచారం. 

ప్లే స్టోర్‎లో వాట్సాప్ అని టైప్ చేయగానే ఈ నకిలీ యాపే అగ్రస్థానంలో కనిపిస్తుండటంతో ఇదే నిజమైన యాప్ అనుకొని యూజర్లు డౌన్ లోడ్ చేసుకుని మోసపోతున్నారు. ఈ నకిలీ యాప్‎ను సృష్టించిన కేటుగాళ్లు ప్లే స్టోర్‌లోని అర్లీ యాక్సెస్ లేదా టెస్టింగ్ ఫీచర్‌ను ఆయుధంగా వాడుకున్నారు. దీనివల్ల సాధారణ వినియోగదారులు ఆ యాప్‎కు రేటింగ్ ఇవ్వలేరు, రివ్యూలు రాయలేరు. దాంతో అది నకిలీ యాప్ అని గుర్తించడం యూజర్లకు కష్టంగా మారింది.

నిజమైన యాప్‎ను ఎలా గుర్తించాలంటే..?

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే వారు మోసపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యమైనది యాప్ డెవలపర్ పేరును సరిచూసుకోవడం. మొదట.. ప్లే స్టోర్‎లో వాట్సాప్ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్ యాప్‎పై క్లిక్ చేయండి. యాప్ పేరు కింద ఉన్న డెవలపర్ పేరు WhatsApp LLC ఉందో లేదో చూడండి. 

ఎందుకంటే.. గూగుల్ ప్లే స్టోర్‌లో నిజమైన వాట్సాప్ యాప్ కింద డెవలపర్ పేరు WhatsApp LLC అని ఉంటుంది. అసలైన వాట్సాప్‌కు వందల కోట్లలో డౌన్‌లోడ్స్ ఉంటాయి. ప్రస్తుతం ప్లే స్టోర్‎లో వెలుగులోకి వచ్చిన నకిలీ యాప్‌ను Agment Assets sallu అనే గుర్తుతెలియని డెవలపర్ అప్‌లోడ్ చేశారు. ఈ నకిలీ యాప్‌కు కేవలం కొన్ని లక్షల్లో మాత్రమే డౌన్‌లోడ్స్ కనిపిస్తాయి. 

అప్పుడు దానిని నకిలీ యాప్‎గా నిర్ధారించుకుని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే దాన్ని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఉపయోగించి స్కాన్ చేసి యాప్ అనుమతులను సమీక్షించండి. మీరు యాప్‌లో సున్నితమైన సమాచారాన్ని నమోదు చేసి ఉంటే సంబంధిత ఖాతాలను సురక్షితంగా ఉంచుకోండి. వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.