మిట్టగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం దగ్గర మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రవల్లికకు, ప్రయాణికురాలి మధ్య గొడవ జరిగింది. ప్రయాణికురాలి కొడుకుకు ఆఫ్ టికెట్ కోసం 100 రూపాయల నోట్ ఇవ్వడంతో టికెట్కు సరిపడ చిల్లర ఇవ్వాలని కండక్టర్ ప్రవల్లిక ప్రయాణికురాలిని అడిగింది.
ఇరువురి మధ్య ఈ విషయంలో లొల్లైంది. గొడవ ముదిరింది. బస్సు నుంచి కండక్టర్ని ప్రయాణికురాలు బయటికి తోసేసింది. దురదృష్టవశాత్తూ.. కండక్టర్ కాలు ఆర్టీసీ టైర్ కింద పడిపోయింది. కాలు విరిగినంత పనైంది.
తీవ్ర గాయం కావటంతో ఆమెను 108లో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అశ్వాపురం పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే జైలు శిక్ష తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరిస్తున్నా కొందరు ప్రయాణికుల తీరు మారడం లేదు. సహనం కోల్పోయి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
