యాదాద్రి సమీపంలో మంటలు.. అగ్నిపర్వతాన్ని తలపిస్తున్న గుట్ట

యాదాద్రి సమీపంలో మంటలు.. అగ్నిపర్వతాన్ని తలపిస్తున్న గుట్ట

యాదాద్రి జిల్లా :- యాదగిరిగుట్టలో ప్రెసిడెన్షియల్ సూట్ పక్కన ఉన్న ఓ గుట్టకు ఆదివారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. సాయంత్రం సమయంలో మంటలు అంటుకోవడంతో గాలికి మంటల ఉధృతి పెరిగి గుట్ట మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ గుట్ట చీకట్లో అగ్నిపర్వతాన్ని తలపించింది. ఈ విష‌యం గురించి తెల‌సుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రాంతం మొత్తం ఎత్తైన కొండ కావడంతో మంటలను ఆర్పడం కష్టసాధ్యంగా మారింది. మంటలను అదుపులోకి తేవడం కోసం ఫైర్ సిబ్బంది శాయశక్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. మంటలు చెలరేగిన ప్రాంతానికి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో ఫైర్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో, మంటలను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు.