మీకు తెలుసా :పాతకాలంలో పళ్ళు ఎలా తోముకునేవారో తెలుసా ? చిన్న టూత్‌బ్రష్ వెనుక ఇంత కథ ఉందా...

మీకు తెలుసా :పాతకాలంలో పళ్ళు ఎలా తోముకునేవారో తెలుసా ? చిన్న టూత్‌బ్రష్ వెనుక  ఇంత కథ ఉందా...

ఈ రోజుల్లో పళ్ళు తెల్లగా, మెరిసేలా ఉంచుకోవడానికి రకరకాల పద్ధతులు వాడుతున్నాం. కానీ రంగురంగుల బ్రష్‌లు, పేస్ట్‌లు రాకముందు మన పెద్దవాళ్ళు పళ్ళు ఎలా తోముకునేవారో ఎప్పుడైనా ఆలోచించారా...? పళ్ళు శుభ్రం చేసుకునే ఈ ఆసక్తికరమైన చరిత్ర నిన్న మొన్నటిది కాదు, వేల సంవత్సరాల నాటిది. మన టూత్‌బ్రష్ ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దామా ......

5000 ఏళ్ల  క్రితం 
టూత్‌బ్రష్ అనేది ఇప్పటికాలపు ఆవిష్కరణ అనుకుంటే పొరపాటే. దీని మూలాలు క్రీస్తు పూర్వం 3500-3000 సంవత్సరాల నాటివి. ఆ కాలంలో బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు చెట్ల చిన్న చిన్న కొమ్మల చివరలను నమిలి, వాటినే బ్రష్‌లుగా వాడేవారు. ఈజిప్షియన్లు చనిపోయిన వారి సమాధుల్లో ఈ పుల్లలను కూడా పాతిపెట్టేవారంటే వీటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రీ.పూ. 1600 కాలంలో, చైనీయులు నోటి దుర్వాసన పోవడానికి మంచి వాసన ఇచ్చే చెట్ల పుల్లలను నమిలేవారు.

ప్రపంచంలో మొదటి టూత్‌బ్రష్
వెంటికలు (బ్రిసిల్స్) ఉన్న మొదటి నిజమైన టూత్‌బ్రష్‌ను 15వ శతాబ్దంలో చైనాలో తయారుచేశారు. జంతువుల ఎముక లేదా వెదురు పుల్లకు, అడవి పంది మెడ వెంట్రుకలను అమర్చి   దీనిని తయారుచేశారు. ఈ పద్ధతి చైనా నుండి యూరప్‌కు చేరినప్పుడు, అక్కడ పంది వెంట్రుకలు చాలా గట్టిగా అనిపించడంతో వాటి స్థానంలో గుర్రపు వెంట్రుకలను, పక్షుల ఈకలను వాడటం మొదలుపెట్టారు.

ఎముకల నుంచి నైలాన్ వరకు 
మనం ఇప్పుడు వాడుతున్న బ్రష్‌లకు పునాది 1780లో ఇంగ్లాండ్‌లో పడింది. విలియం అడ్డిస్ అనే వ్యక్తి పశువుల ఎముకకు అడవి పంది వెంట్రుకలను అమర్చి బ్రష్ తయారుచేశారు. ఆ తర్వాత 1844లో మూడు వరుసల వెంట్రుకలు ఉండే డిజైన్ వచ్చింది.

టూత్‌బ్రష్ చరిత్రలో పెద్ద మార్పు 1938లో వచ్చింది. ఆ సంవత్సరంలో డ్యూపాంట్ అనే కంపెనీ 'నైలాన్'ను కనుగొంది. దీంతో ఆధునిక టూత్‌బ్రష్‌లు అందుబాటులోకి వచ్చాయి. 1950 నాటికి ఇంకా మృదువుగా ఉండే నైలాన్ బ్రష్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి.

ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ఎప్పుడు వచ్చింది?
టెక్నాలజీ పెరిగాక, 1939లోనే మొదటి ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ తయారుచేశారు. కానీ 'బ్రాక్సోడెంట్' పేరుతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ 1960లలో అమెరికాలో బాగా అందుబాటులోకి వచ్చింది. ఈ రోజుల్లో రకరకాల ఆకారాలు, రంగుల్లో అనేక రకాల బ్రష్‌లు ఉన్నాయి. అయితే, వేల ఏళ్ళ క్రితం ఈజిప్షియన్లు వాడిన పద్ధతే ఇప్పటికీ ఉందనడంలో అనుమానం లేదు. 

టూత్‌బ్రష్ కంటే ముందే టూత్‌పేస్ట్ 
టూత్‌బ్రష్ కంటే ముందే టూత్‌పేస్ట్ వచ్చిందనేది నిజం.క్రీ.పూ. 5000 నాటికే ఈజిప్షియన్లు పళ్ళు తోముకోవడానికి ఒక రకమైన పేస్ట్ వాడేవారు. క్రీ.పూ. 500 నాటికి చైనా, భారతదేశాల్లో కూడా ఇది మొదలైంది. గ్రీకులు, రోమన్లు కూడా పళ్ళు తెల్లగా ఉండటానికి కొన్ని మిశ్రమాలను తయారుచేశారు.

పాతకాలంలో టూత్‌పేస్ట్ ఎలా ఉండేది?
అప్పట్లో కూడా పళ్ళు తెల్లగా చేయడం, చిగుళ్ళు శుభ్రంగా ఉంచడం, నోటి దుర్వాసన పోగొట్టడానికే పేస్ట్‌లు వాడేవారు. కాకపోతే వాడిన పదార్థాలు వింతగా ఉండేవి:

ఈజిప్ట్: ఎద్దు గిట్టల బూడిద, కాల్చిన గుడ్డు పెంకులు, రాతి పొడి కలిపి పేస్ట్ చేసేవారు.

గ్రీస్, రోమ్: నలిపిన ఎముకలు, గవ్వల పొడి వాడేవారు. రోమన్లు ఐతే నోటి దుర్వాసన పోవడానికి చెట్టు బెరడు, సుగంధ ద్రవ్యాలు, బొగ్గు పొడి కలిపేవారు.

చైనా: చైనా కూడా పేస్టులలో జిన్సెంగ్, పుదీనా, ఉప్పు వంటివి వాడటం మొదలుపెట్టారు.

టూత్‌పేస్ట్‌లో వచ్చిన మార్పులు ఏమిటి?
1800  నాటికి టూత్‌పేస్ట్‌లో మార్పులు మొదలయ్యాయి. మొదట్లో సబ్బును కూడా వాడేవారు. ఇంగ్లాండ్‌లో  పేస్ట్‌లో వక్క పొడి కలిపేవారు. 1860 నాటికి ఇంట్లోనే బొగ్గు పొడితో పేస్ట్ చేసుకునేవారు. 1850 కాలంలో సుద్దపొడి కలపడం మొదలుపెట్టారు. అంతకుముందు వరకు పేస్ట్ పొడి (పౌడర్) రూపంలోనే లభించేది.

1850లలో "క్రీమ్ డెంటిఫ్రైస్" పేరుతో గ్లాసు జాడీలలో పేస్ట్ వచ్చింది. 1873లో కోల్గేట్ కంపెనీ పెద్ద ఎత్తున ఈ జాడీల పేస్ట్‌ను అమ్మడం మొదలుపెట్టింది. కానీ అసలైన మార్పు 1890లలో వచ్చింది. కోల్గేట్ సంస్థ మనం ఇప్పుడు చూస్తున్న ట్యూబ్ లలో పేస్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది ఎంతగా నచ్చిందంటే ఇప్పటికీ ప్రపంచమంతా ఇదే వాడుతున్నారు.

పుచ్చిపోకుండా ఉండటానికి 1914లో ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్‌ను తెచ్చారు. 1945 వరకు నురుగు కోసం సబ్బు వాడేవారు, ఆ తర్వాత సబ్బు స్థానంలో 'సోడియం లారిల్ సల్ఫేట్' వంటి రసాయనాలు వాడటంతో పేస్ట్ మెత్తగా, మంచి రుచితో తయారవ్వడం మొదలైంది.