బిగ్ బాస్ అభిమానులకు ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ కాదు.. ఏకంగా మల్టిపుల్ కానుంది. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఈ ఏడాది సరికొత్త రికార్డుకు రెడీ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని బిగ్ బాస్ సీజన్లను ఒకే రోజు ప్రారంభించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6న ఐదు భాషల్లో బిగ్ బాస్ సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిందీలో బిగ్ బాస్ 20కు మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్ తమ హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలుగులో నాగార్జున మరోసారి బిగ్ బాస్ హౌస్‌కు హోస్ట్‌గా చేస్తునారు. దీంతో ఐదు భాషల్లో ఒకేసారి స్టార్ హోస్టుల సందడి కనిపించనుంది.
ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పలు భాషల్లో సామాన్యుల ఎంపిక కోసం 'ఆగ్నిపరీక్ష 2' కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపికైన వారిలో టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. అంటే ఈసారి కూడా హౌస్‌లో కేవలం సెలబ్రిటీలే కాకుండా.. తమ జీవిత కథలు, టాలెంట్, వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సామాన్యులు కూడా సెలబ్రిటీలతో కలిసి గేమ్ ఆడనున్నారు.
కొత్త హౌస్ డిజైన్, విభిన్నమైన టాస్కులు, ఊహించని ట్విస్టులు, లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు కంటెస్టెంట్ల మధ్య సంబంధాలు, గొడవలు, స్నేహాలు, ఎమోషన్స్.. ఇలా ప్రతిరోజూ కొత్త డ్రామాకు తెరలేచే అవకాశం ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ ఫైనల్ కు చేసింది. ఐదు భాషలకు.. ఐదుగురు స్టార్ హీరో హోస్టులుగా చేస్తున్నారు.. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల కాన్సెప్ట్ తో వస్తున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలా కాకుండా... దేశవ్యాప్తంగా నడిచే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్‌గా మారబోతోంది..
ఈ రెండు వర్గాల మధ్య జరిగే మైండ్ గేమ్స్, టాస్క్‌లు ఈ సీజన్‌లను ఊహించని మలుపులు తిప్పబోతున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన ఒకేసారి ఐదు వేర్వేరు భాషల్లో ఈ షో ఏకకాలంలో ప్రారంభం కాబోతుండటం భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక సెన్సేషన్ గా మారనుంది.. సరికొత్త థీమ్స్, కళ్ళు చెదిరేలా డిజైన్ చేసిన లగ్జరీ హౌస్‌లు, మొదటి రోజు నుంచే 24/7 ఎక్స్‌క్లూజివ్ లైవ్ స్ట్రీమింగ్‌తో అభిమానులకు ఇది పండుగే అని చెప్పాలి.
